కాళేశ్వరంపై ఇంజినీర్ల విచారణ కంప్లీట్

by Shiva |
కాళేశ్వరంపై ఇంజినీర్ల విచారణ కంప్లీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలు, అవకతవకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇంజినీర్లు దాదాపుగా ఎంక్వయిరీని పూర్తిచేశారు. ఇప్పటివరకూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన డ్యామేజీ, నిర్మాణ సమయంలో బాధ్యులుగా ఉన్న ఇంజినీర్లను పిలిచి విచారించిన కమిషన్.. వారి నుంచి అఫిడవిట్లను తీసుకున్నది. గత మూడు రోజులుగా లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్‌హౌజ్‌లతో సంబంధం ఉన్న చీఫ్ ఇంజినీర్లు మొదలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల వరకు ఎంక్వయిరీ చేసింది. దానికి కొనసాగింపుగా అసిస్టెంట్ ఈఈలను సైతం బుధవారం విచారించింది. పంప్ హౌజ్‌ల డిజైన్, విద్యుత్ సరఫరా వ్యవస్థ, వినియోగం, గతంలో వరదలు వచ్చినప్పుడు మునిగిపోవడానికి కారణాలు.. ఇలాంటి అనేక అంశాలపై వారి నుంచి వివరణ తీసుకున్నది. మౌఖికంగా చెప్పిన అంశాలను రెండు మూడు రోజుల్లో అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సిందిగా కమిషన్ ఆదేశించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ అంశాలతో ఉన్న సంబంధాలపై గతంలోనే కమిషన్‌కు ట్రాన్స్ కో ఇంజనీర్లు వివరాలు సమర్పించడంతో వాటిపై గురువారం కమిషన్ విచారించనున్నది. కొద్దిమంది విద్యుత్ అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఇప్పటికే పలువురు మాజీ అధికారులు (మూడు బ్యారేజీల నిర్మాణం సమయంలో సర్వీసులో ఉండి ఇప్పుడు రిటైర్ అయినవారు) కమిషన్ ముందు హాజరై వివరాలు అందించగా, ఇరిగేషన్ డిపార్టుమెంటుకు కార్యదర్శులుగా వ్యవహరించి పదవీ విరమణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లను త్వరలో విచారణకు పిలవనున్నది. ఈ విచారణ ప్రక్రియ కూడా పూర్తయితే ఇంజినీర్లు, అధికారులు, నిపుణుల నుంచి టెక్నికల్ అంశాలపై ఎంక్వయిరీ (ఫస్ట్ ఫేజ్) దాదాపు కొలిక్కి వచ్చినట్లవుతుంది.

సెకండ్ ఫేజ్‌లో భాగంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలపై కమిషన్ ఫోకస్ పెట్టనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు లభించిన ఆమోదం, అంచనా వ్యయం, చేసిన ఖర్చు, దాని డిజైన్ మార్చడానికి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, కాళేశ్వరం ఆవశ్యకత, దీని అంచనా వ్యయం, ఆ తర్వాత సవరణలకు దారితీసిన పరిస్థితులు, ఎంత మొత్తంలో ఖర్చు పెరిగింది, కాంట్రాక్టు పనుల అప్పగింతకు అనుసరించిన విధానాలు, సబ్ కాంట్రాక్టు సిస్టమ్ తదితర ఆర్థిక అంశాలపై ఫోకస్ పెట్టనున్నది.

Advertisement

Next Story

Most Viewed