నిన్న సోమేశ్ నేడు రజత్ కుమార్.. మాజీ ఐఏఎస్ ల భూములపై దుమారం

by Prasad Jukanti |
నిన్న సోమేశ్ నేడు రజత్ కుమార్.. మాజీ ఐఏఎస్ ల భూములపై దుమారం
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో పలువురు కీలక ఉన్నతాధికారుల ఆస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఒక్కో అధికారికి సంబంధించిన ఆస్తుల చిట్టా వెలుగు చూస్తుండటం సంచలనం రేపుతున్నది. అవినీతి సొమ్ముతోనే వీరంతా పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భార్య పేరుతో 25 ఎకరాల భూముల వ్యవహారంపై పలు అనుమానాలు రేకెత్తుతున్న వేళ తాజాగా మరో కీలక రిటైర్డ్ ఏఐఎస్ అధికారి రజత్ కుమార్ భూముల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రజత్ కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఏకంగా 52 ఎకరాల భూములు ఉన్నట్లు తాజాగా వెలుగు చూసింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర అధికార వర్గాల్లో సంచలనంగా మారింది.

అధికారం మారగానే అమ్మకానికి భూములు!:


మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజిపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 77,78, 82 రజత్ కుమార్ ఆయన కుటుంబ సభ్యుల పేరుతో 52 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రజత్ కుమార్ పేరిటే 15 ఎకరాల 25 గుంటల భూమి కొనుగోలు చేశారని అయితే ఈ భూములు కొన్న వ్యవహారం డీఓపీటీకి రజత్ కుమార్ సమాచారం ఇచ్చారా లేదా అనేది క్లారిటీ లేదు. కాగా ఇటీవల రాష్ట్రంలోని అధికారుల భూముల కొనుగోలు వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు రావడంతో తన పేరుతో ఉన్న భూములను రజత్ కుమార్ అమ్మకానికి పెట్టారనే టాక్ వినిపిస్తోంది. నేడో రేపో తన భూములను ఇతరుల పేరు మీదకు బదలాయించేందుకు రజత్ కుమార్ ప్రత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం మారిన 2 నెలలకే రజత్ కుమార్ ఎందుకు భూమి అమ్మాలనుకుంటున్నారనేది ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.

Advertisement

Next Story