- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికలే టార్గెట్.. దశాబ్ది వేడుకల్లో ఆ స్కీం వాడుకునేలా సీఎం కేసీఆర్ బిగ్ స్కెచ్!
దళితబంధు పథకం మరోసారి తెరపైకి వచ్చింది. దశాబ్ది వేడుకల్లో ఒక రోజును దళితబంధు డే గా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జూలై నుంచి ఈ పథకాన్ని కంటిన్యూ చేయాలని తాజాగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ సారి ఎంతమందికి సాయం అందిస్తారన్న అనుమానం లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతున్నది. గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.17వేల కోట్లు కేటాయించినా.. ఒక్కరికీ లబ్ధి చేకూరలేదు.
ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో అంతే మొత్తంలో కేటాయించగా.. ఎంత మందికి ఇస్తారనే విషయంపై సస్పెన్స్ నెలకొన్నది. మరో వైపు ప్రభుత్వం ఎన్నికల కోణంలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడే లబ్ధిదారులకు సాయం పంపిణీ చేస్తే ఎన్నికల నాటికి మర్చిపోతారని, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే సమయంలో సాయం అందిస్తే దాని ద్వారా ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరుతుందన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో : దళితబంధు లబ్ధిదారులకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌లో జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దళితబంధు లబ్ధిదారులకు సాయం పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులోభాగంగా ఉత్సవాల్లో ఒక రోజును ‘దళితబంధు డే’గా నిర్వహించాలని నిర్ణయించారు.
ఆరోజున కొందరికి పంపిణీ చేసి.. జూలై నుంచి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని.. ఈ మేరకు కసరత్తులు చేసుకోవాలని సూచించారు. బడ్జెట్లో ఈ ఏడాది ఈ పథకానికి రూ.17వేల కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించినా.. ఒక్కరికీ పంపిణీ కాలేదు. దీంతో ఈ సంవత్సరం ఎంతమందికి అందుతుందని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పథకానికి, ఎన్నికల షెడ్యూల్‌కు లింకు పెట్టాలని సర్కారు భావిస్తున్నది.
ఇప్పుడే సాయం చేస్తే మరిచిపోతారని, అందుకే షెడ్యూలు వెలువడడానికి కొన్ని రోజుల ముందు లబ్ధిదారుల అకౌంట్‌లో డబ్బులు వేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. ఎలక్షన్ ముందు స్కీమ్ అమలు చేస్తే లబ్దిదారుల్లో ఉత్సాహం ఉంటుందనేది ఇందుకు కారణం. పార్టీకి పబ్లిసిటీ వచ్చేలా అధికారులకు ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్టు సచివాలయ వర్గాల సమాచారం.
నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తే, రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నది. దళితబంధు ప్రక్రియను రెండు నెలలపాటు కొనసాగిస్తే ఎన్నికల ముందు ప్రభుత్వానికి ప్రచారం దక్కుతుందని, ఓటర్ల మైండ్‌ను సెట్ చేయడానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
సెగ్మెంట్‌కు వెయ్యి మంది
ఈ సారి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కింద 1,000 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ. 10లక్షల చొప్పున సాయం చేసేందుకు రూ.17 వేల కోట్లను బడ్జెట్ కేటాయించారు. ఆర్థిక సంవత్సరం మొదలై రెండు నెలలు దాటుతున్నా.. ఇంతవరకు లబ్ధిదారుల ఎంపికే ప్రారంభం కాలేదు. నియోజకవర్గానికి ఎంతమందిని ఎంపిక చేయాలో జిల్లా అధికారులకు మార్గదర్శకాలూ జారీ కాలేదు. సర్కారు దగ్గర డబ్బులు లేకపోవడంతో సమకూర్చుకోడానికి కొంత సమయం పడుతుందని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
స్కీమ్ పకడ్బందీ అమలు విషయాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడి నెలకు కనీసంగా ఒక్కో సెగ్మెంట్‌కు వంద మంది చొప్పున వరుసగా ఐదు నెలల పాటు క్రమం తప్పకుండా డబ్బులు జమచేస్తే ఒకేసారి 500 మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పినట్టు ఆ అధికారి తెలిపారు. కానీ సీఎం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో జూలై నుంచి ఎలా ప్రారంభించాలన్నదానిపై ఇంకా పూర్తి స్థాయి సమాచారం తమ శాఖకు రాలేదని వివరించారు.
దశాబ్ది వేడుకల్లో..
రాష్ట్ర అవిర్భావం సందర్భంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించే దశాబ్ది వేడుకల్లో ఒక రోజును దళితబంధు డేగా ప్రభుత్వం నిర్వహించనుంది. ఆ రోజున ప్రతి అసెంబ్లీ సెగ్మంట్‌లో ఇద్దరు, ముగ్గురి చొప్పున చెక్కులను పంపిణీ చేసి, జూలై నుంచి లబ్ధిదారుల ఎంపిక సహా పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నిర్వహించిన సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. అయితే లబ్ధిదారుల ఎంపిక సంగతిపై స్పష్టత లేకపోవడంతో అర్హత కలిగినవారందరికీ అందుతుందా?.. లేక కొందరికి మాత్రమే దీనిని పరిమితం చేస్తుందా? అనే సందేహాలు నెలకొన్నాయి.
గత ఏడాది ఒక్కరికీ ఇవ్వలే..
2022–23 బడ్జెట్ లో దళిత బంధు స్కీమ్ కింద రూ. 17 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మంట్ కింద 1000 మంది చొప్పున లబ్దిదారులను ఎంపికచేసి వారికి సాయం చేస్తామని ప్రకటించింది. కానీ నిధుల కొరతతో లబ్ధిదారుల సంఖ్యపై పరిమితుల గురించి ఆలోచించింది. తొలుత 500 మందిని ఎంపిక చేయాలని అనుకున్నది. కానీ ఆర్థిక వనరులు సమకూరకపోవడంతో దీన్ని 200 మందికి మాత్రమే కుదించాలనుకున్నది.
చివరికి ఒక్కరికీ కూడా ఇవ్వలేకపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఈ అసంతృప్తి ఓపెన్‌గానే వ్యక్తమైంది. ఈ సంవత్సరమైనా బడ్జెట్ లో చేసిన కేటాయింపుల మేరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందా?.. లేక గతేడాది మాదిరిగానే పక్కన పెడుతుందా? అనేది రానున్న రోజుల్లో తేలనున్నది.
దశాబ్ది వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించి రైతుబంధు, దళితబంధు సహా పలు స్కీమ్‌లను గొప్పగా ప్రచారం చేసుకోవాలని భావించిన సర్కారు ప్రత్యేకంగా వీటికి ఒక్కో రోజును ఫిక్స్ చేసింది. లాంఛనంగా కొద్దిమంది లబ్ధిదారులకు మాత్రం ఆ వేదికల మీద సాయాన్ని అందజేసి చేతులు దులుపుకుని కొత్త ప్రభుత్వంలో లబ్ధిదారులందరికీ సాయం అందిస్తామని ప్రకటిస్తుందా?.. లేక ప్రజల్లో నమ్మకం కలిగించేలా లక్ష్యం మేరకు అందరికీ అందిస్తుందా? అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.
Also Read: ఉత్సవాలు కాదు విజయాలు కావాలి!