కథ మళ్లీ మొదటికి.. విధులకు రావాలని అందని పిలుపు!

by GSrikanth |   ( Updated:2023-06-05 23:30:53.0  )
కథ మళ్లీ మొదటికి.. విధులకు రావాలని అందని పిలుపు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేజీబీవీల సమస్యలు మళ్లీ మొదటికి వచ్చాయి. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు ఈనెల 12వ తేదీ నుంచి పున:ప్రారంభం కానున్నాయి. విద్యాసంవత్సరం మొదలవుతున్నా ఇప్పటి వరకు విధులకు హాజరుకావాలని సీఆర్టీలు, పీజీసీఆర్టీలకు పిలుపందలేదు. సబ్జెక్టుల వారీగా ఇంటర్ పరీక్షలు ముగిసిన అనంతరం ఒక్కొక్కరిని టర్మినేట్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. టర్మినేట్ చేసినా ఇప్పటి వరకు వారికి గత విద్యాసంవత్సరానికి సంబంధించిన రెండు నెలల వేతనాలు పెండింగ్‌లోనే ఉంచింది. ఇప్పటికీ అందించలేదు. ఇదిలా ఉండగా సీఆర్టీలు, పీజీసీఆర్టీలు విధుల్లోకి రావాలని పిలుపు అందకపోగా ఇటీవల చేపట్టిన బదిలీల ప్రక్రియలో ప్రస్తుతం కొనసాగుతున్న పీజీసీఆర్టీల స్థానాలను వేకెంట్‌గా చూపించడం 1991 మంది సిబ్బందిలో ఆందోళనను కలిగిస్తోంది. మిగిలిన ఖాళీలను నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. గత విద్యాసంవత్సరం కూడా ఇలాంటి ఇబ్బందులనే వారు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది కూడా అవే తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తొలుత మెరిట్ ప్రకారం పీజీసీఆర్టీలను విధుల్లోకి తీసుకున్నారు. కాగా, ఇప్పుడు కొనసాగుతున్న వారిని తొలగించి ఆ పోస్టులను ఖాళీలుగా చూపించి మిగిలిన ఖాళీలను నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలని విద్యాశాఖ ప్లాన్ చేస్తోంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ వీరిని మెరిట్ బేసిస్‌లోని రిక్రూట్ చేసుకున్నారు. వారికి ఆర్డర్ కాపీలు కూడా అందించారు. పీఆర్సీ సైతం అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యాసంవత్సరానికి సబంధించిన నియామక ప్రక్రియ సైతం అకడమిక్ ఇయర్ ప్రారంభించేలోపు పూర్తవుతుంది. కానీ తెలంగాణలో మరో వారంలో కేజీబీవీలు ప్రారంభం కాబోతున్నా ఇప్పటి వరకు ముందడుగు పడకపోగా కనీసం గత విద్యా సంవవత్సరం ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన వేతనాలు సైతం ఇప్పటివరకు అందించకపోవడం గమనార్హం.

వేతనాలు అందక సిబ్బంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఆర్టీలు, పీజీసీఆర్టీలు, పీఈటీ పోస్టుల్లో కొనసాగుతున్న వారిలో పలువురు వితంతువులు, ఒంటరి మహిళలు ఉండగా ఒక్కరి వేతనంతోనే ఇల్లు గడిచే కుటుంబాలున్నాయి. దీంతో వారు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందించి తమకు మాత్రం అందించకపోవడంపై సీఆర్టీలు, పీజీసీఆర్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు వేతనాలు అందించినా నెల నెలా కాకుండా మూడు, నాలుగు నెలలకోసారి అందిస్తున్నారని వాపోతున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీకి సైతం పీఆర్సీ అమలు చేస్తున్నారని, తమకు మాత్రం ఎలాంటి బెనిఫిట్స్ అందించకుండా అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు చెబుతున్నారు. పీఆర్సీ అమలు చేస్తే అదనంగా మరో రూ.1 లక్ష వస్తుందని, తమకు మేలు చేకూరుతుందని చెబుతున్నారు.

గత విద్యాసంవ్సతరం కేజీబీవీలు 79 శాతం ఉత్తీర్ణత సాధించాయని, తమ కృషి వల్లే ఇది సాధ్యమైందని పలువురు చెబుతున్నారు. అయినా అధికారులు తమపై ఇలా కక్షపూరితంగా వ్యవహరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు సెలవులు కూడా ఇవ్వరని, సెలవు దినాల్లో కూడా పనిచేయాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన కావాలనే తమను రెండేండ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వారు వాపోయారు. ఇదిలా ఉండగా ఈ విద్యాసంవత్సరం కొత్తగా 38 కేజీబీవీలు అప్ గ్రేడ్ అయ్యాయి. వీటిలో కనీసం దాదాపు 1000 మంది సిబ్బంది అవసరం ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చూసినా ఈ ప్రక్రియ ఎప్పుడో పూర్తిచేయాల్సి ఉంది. ఎందుకంటే ఈనెల 12వ తేదీ నుంచి కేజీబీవీలు ప్రారంభమవుతుంటే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. విద్యార్థుల భవిష్యత్‌తో విద్యాశాఖ చెలగాటమాడాలని చూస్తోందని పలువురు విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అయినా టర్మినేట్ చేసిన సీఆర్టీ, పీజీసీఆర్టీ, పీఈటీలను త్వరగా విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story