- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కవిత ఫ్యామిలీపై ఈడీ స్పెషల్ ఫోకస్! ఆ సంస్థల్లో సోదాలు?
కవిత ఫ్యామిలీపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన డబ్బుతోనే వట్టినాగులపల్లి భూములు కొనుగోలు చేశారని ఈడీ బలంగా అనుమానిస్తున్నది. పిళ్లయ్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారమంతా జరిగినా.. దాని వెనక కవిత ఉన్నట్టు ఈడీ భావిస్తున్నది. దీనికి ముందే బుచ్చిబాబు ఫీనిక్స్ సంస్థ నుంచి ఎన్ గ్రోత్ క్యాపిటల్ పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో అనిల్ పేరును కూడా ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూడో చార్జిషీట్‌లో ప్రస్తావించింది.
భూముల కొనుగోళ్లలో ఎమ్మెల్సీ దంపతులు యాక్టివ్‌గా పాల్గొన్నట్టు ఈడీ ఓ అభిప్రాయానికి వచ్చింది. భూ లావాదేవీల్లో మీడియేషన్ చేసిన వేముల శ్రీహరిపైనా దర్యాప్తు సంస్థ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫీనిక్స్, క్రియేటివ్ డెవలపర్స్, ఎన్ గ్రోత్ క్యాపిటల్‌తో పాటు పలు రియల్ సంస్థలపై గురిపెట్టినట్టు సమాచారం. త్వరలో పూర్తి వివరాలను రాబట్టేందుకు సోదాలు జరిపే అవకాశం ఉన్నట్టు ఈడీ వర్గాల సమాచారం. సోదాల అనంతరం కొత్తగా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో లాభాలు హైదరాబాద్‌లో భూముల కొనుగోలుకు మళ్లినట్టు బలంగా అనుమానిస్తున్న ఈడీ.. రియల్ ఎస్టేట్ సంస్థలపై దృష్టి సారించింది. ఈ స్కామ్‌లో అనుమానితులు, నిందితులుగా ఉన్న ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ పిళ్లయ్ వెల్లడించిన వివరాలే ఇందుకు కారణం కానున్నాయి. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన (లెక్కల్లోకి రాని) డబ్బును భూముల కొనుగోలుకు పెట్టుబడిగా పెట్టినట్టు ఈడీ అనుమానిస్తున్నది. వీరిద్దరి స్టేట్‌మెంట్‌తో పాటు క్రియేటివ్ డెవలపర్స్ అనే రియల్ సంస్థకు చెందిన ప్రతినిధులు వెల్లడించిన వివరాలు మరింత బలం చేకూర్చినట్లయిందన్నది ఈడీ వాదన. అందుకే స్పెషల్ కోర్టుకు సమర్పించిన మూడవ సప్లిమెంటరీ చార్జిషీట్‌లో కవిత కనుసన్నల్లోనే ఈ భూముల కొనుగోళ్లు జరిగినట్లు వ్యాఖ్యానించింది.
లిక్కర్ స్కామ్ దర్యాప్తు జరిపే క్రమంలో హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ సంస్థలతో జరిగిన ఆర్థిక లావాదేవీలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే పలు రియల్ సంస్థలపై ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాల సమయంలో లిక్కర్ స్కామ్‌తో ఉన్న లింకులు వెలుగులోకి రాలేదు. కానీ బుచ్చిబాబు, అరుణ్ పిళ్లయ్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్లతో ఫీనిక్స్, క్రియేటివ్ డెవలపర్స్, ఎన్‌గ్రోత్ కాపిటల్ లాంటి కొన్ని సంస్థల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీటికి లిక్కర్ స్కామ్‌తో నేరుగా సంబంధం లేకపోయినా అందులో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులకు భూముల కొనుగోళ్లతో ఉన్న లింకులపై ఆరా తీయాలని ఈడీ భావిస్తున్నది.
గతంలో రెయిడ్స్ చేసిన సంస్థలతో పాటు మరికొన్ని కొత్తవాటిపైనా దాడులు చేసే చాన్స్ ఉన్నది. ఈ భూముల కొనుగోళ్లలో మీడియేటర్‌గా వ్యవహరించిన క్రియేటివ్ డెవలపర్స్ కంపెనీకి చెందిన వేముల శ్రీహరిపై ఈడీ నజర్ పెట్టింది. వట్టినాగులపల్లిలో గతేడాది ఏప్రిల్, మే నెలల్లో మూడు విడతలుగా పిళ్లయ్ ఖాతా నుంచి క్రియేటివ్ డెవలపర్స్ కంపెనీకి మూడు విడతల్లో ఐదు కోట్ల రూపాయలు బదిలీ అయిన విషయంపై ఈడీ ఫోకస్ పెట్టింది. నాలుగు ఎకరాల డీల్ కోసం శ్రీహరి సూచన మేరకే ఈ డబ్బు క్రియేటివ్ డెవలపర్స్ కంపెనీ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయినట్టు ఈడీ భావిస్తున్నది. క్రియేటివ్ కంపెనీకి చెందిన రవిశంకర్ చెట్టి, రవి వర్మ రాజు వెల్లడించిన వివరాలు కూడా దీన్నే ధ్రువీకరిస్తున్నాయి.
అరుణ్ పిళ్లయ్ ఏనాడూ తమ ఆఫీసుకు రాలేదని, ఫోన్‌లో సైతం ఆయనతో సంప్రదింపులు జరగలేదని, కానీ డబ్బులు మాత్రం ఖాతాలోకి చేరాయని వేర్వేరు స్టేట్‌మెంట్లలో వారిద్దరూ వ్యాఖ్యానించిన విషయాన్ని చార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్నది. ఫీనిక్స్ సంస్థలో ఒకప్పుడు సీఓఓగా ఉన్న శ్రీహరి.. క్రియేటివ్ కంపెనీకి డబ్బులు బదిలీ చేయాలని పిళ్లయ్‌కు సూచించడం వెనక ఉన్న అవసరాన్ని ఈడీ రాబట్టాలనుకుంటున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సౌత్ గ్రూపు తరఫున లిక్కర్ స్కామ్‌లో ప్రతినిధిగా మాత్రమే కాక హైదరాబాద్‌లో భూముల కొనుగోళ్లలోనూ ఆమెకు పిళ్లయ్ బినామీగా వ్యవహరించారన్నది ఈడీ అభియోగం.
గతేడాది ఏప్రిల్, మే నెలల్లో ఐదు కోట్లను బదిలీ చేసిన పిళ్లయ్ ఆ భూములను రిజిస్టర్ చేసుకోలేదని, సేల్ డీడ్ కూడా కుదుర్చుకోలేదని, అక్టోబరు 11న ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని ఈడీ వివరించింది. కవిత ఆదేశాల మేరకే భూముల కొనుగోలు జరిగిందని వ్యాఖ్యనించింది. తొలుత రిజిస్ట్రేషన్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదని, ఈడీ ఎంక్వయిరీ ప్రారంభమైన తర్వాత మాత్రమే తొందరపడ్డారని రవిశంకర్ చెట్టి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు ఈడీకి మరింత అనుమానాన్ని రేకెత్తించింది.
ఆదాయపు పన్ను శాఖ వివరాలతో ట్యాలీ..
లిక్కర్ స్కామ్ విషయంలో ఇండో స్పిరిట్ కంపెనీ నుంచి లాభాలు కవిత ఖాతాలోకి నేరుగా రాకుండా జాగ్రత్తలు తీసుకున్న పిళ్లయ్.. ఇప్పుడు భూముల విషయంలోనూ ఎమ్మెల్సీ పేరుతో కాకుండా తన భార్య పేరుతో వ్యవహారం నడిపించారని ఈడీ పేర్కొన్నది. క్రియేటివ్ డెవలపర్స్, ఫీనిక్స్ సంస్థల మధ్య ఉన్న సంబంధాన్ని వెలికి తీయడం ఇప్పుడు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనివార్యమైంది. జూబ్లీహిల్స్‌లో ఉన్న క్రియేటివ్ కంపెనీకి శ్రీహరి మార్చిలోనే వెళ్లారని, నాలుగు ఎకరాల డీల్‌కు సంబంధించిన డబ్బులు పడతాయని చెప్పగా రెండు నెలల తర్వాత పిళ్లయ్ ఖాతా నుంచి బదిలీ అయ్యాయి. ఈ డబ్బుకు సంబంధించి పిళ్లయ్ సమర్పించిన ఐటీ రిటన్స్, ఇండో స్పిరిట్స్ కంపెనీకి వచ్చిన లాభాలు తదితరాలన్నింటిపై ఆదాయపు పన్ను శాఖ దగ్గర ఉన్న వివరాలను జోడించి ఇకపైన ఈడీ దర్యాప్తు చేయాలనుకుంటున్నది.
పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్
శ్రీహరి, పిళ్లయ్‌కు మధ్య ఉన్న సంబంధాలతో పాటు ఆ రెండు కంపెనీల మధ్య జరిగిన లాండ్ డీల్స్ వ్యవహారాన్ని ఈడీ వెలికి తీయనున్నది. కవిత ఆదేశం మేరకే భూముల కొనుగోలు జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ.. బుచ్చిబాబు, పిళ్లయ్ స్టేట్‌మెంట్లతో పాటు క్రియేటివ్ కంపెనీకి చెందిన రవిశంకర్ చెట్టి, రవి వర్మ రాజు ఇచ్చిన వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నది. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారా లాండ్ డీల్ జరిగిందన్న అనుమానంతో ఈ రెండు కంపెనీలు వివిధ వెంచర్ల ద్వారా చేసిన ‘రియల్’ వ్యాపారం వివరాలనూ ఈడీ లోతుగా అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. భూముల కొనుగోలులో శ్రీహరికి ఉన్న ఇంట్రెస్టు, పిళ్లయ్‌కు సహకారం అందించడం వెనక ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీయాలనుకుంటున్నది. ఆ రియల్ కంపెనీల భూ లావాదేవీల్లో జరిగిన బ్లాక్, వైట్ మనీ ట్రాన్సాక్షన్లు కూడా ఈడీ పరిశీలనలో ఉన్నాయి.
మరికొన్ని సంస్థలపై దాడులు?
బుచ్చిబాబు స్టేట్‌మెంట్ ఇచ్చిన వారాల వ్యవధిలోనే మరోమారు ఆయనను ఢిల్లీకి పిలిపించుకుని వరుసగా రెండు రోజుల పాటు ఈడీ ప్రశ్నించింది. కొన్ని డాక్యుమెంట్లను ఇవ్వాల్సిందిగా కోరినందునే ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఆయన ప్రత్యక్షమైనట్టు తెలిసింది. గతంలో శ్రీహరి ద్వారానే భూములు కొన్నట్టు బుచ్చిబాబు మార్చి 28న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఆ సమయంలో ఫీనిక్స్ కంపెనీకి శ్రీహరి సీఓఓగా ఉన్నారని, ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కూడా వ్యాపార భాగస్వామిగా ఉన్నారని, ఎన్‌గ్రోత్ కాపిటల్ పేరు మీద ఆ స్థలాన్ని కొన్నానని బుచ్చిబాబు ఆ స్టేట్‌మెంట్‌లో వివరించారు.
కవితకు ఉన్న రాజకీయ పలుకుబడి ద్వారానే మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు భూములు కొన్నట్టు బుచ్చిబాబు పేర్కొన్నారు. తాజా విచారణలో బుచ్చిబాబు అదనపు వివరాలు అందించారా? లేక తన వెంట తీసుకెళ్లిన డాక్యుమెంట్లలోని వివరాల గురించి వివరించారా? అనేది తెలియాల్సి ఉన్నది. లిక్కర్ స్కామ్ దర్యాప్తు జరుగుతుండగానే ఈడీ ఫోకస్ హైదరాబాద్ రియల్ సంస్థలపైన కూడా పడనున్నది. కొత్త వ్యక్తుల పేర్లు, అదనపు వివరాలు ఏమేం తెరపైకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.