ధన ప్రవాహంపై ఈసీ స్పెషల్ ఫోకస్.. పొలిటీషియన్ల బ్యాంకు ఖాతాలపై ఆరా

by Satheesh |   ( Updated:2023-10-25 06:54:59.0  )
ధన ప్రవాహంపై ఈసీ స్పెషల్ ఫోకస్.. పొలిటీషియన్ల బ్యాంకు ఖాతాలపై ఆరా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డబ్బు, మద్యం ప్రవాహం ఈసారి ఎన్నికల్లో ఎక్కువగానే ఉంటుందని ముందుగానే అంచనా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం వివిధ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాటితో ఎప్పటికప్పుడు డేటాను విశ్లేషిస్తున్నది. మొబైల్ ఫోన్లతో జరిపే డిజిటల్ లావాదేవీలను, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లను కూడా పసిగడుతున్నది.

ఇందుకోసం హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు రీజినల్ ఆఫీస్‌తో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నది. ఒకే బ్యాంకు ఖాతా నుంచి జరిగే అన్ని రకాల లావాదేవీల వివరాలను ఎప్పటిప్పుడు అందించాల్సిందిగా సమావేశం ఏర్పాటు చేసి సహకారం కోరింది. ఈ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతున్నది.

రాష్ట్రంలోని రాజకీయ నాయకుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎక్కువ లావాదేవీలు ఒకే ఖాతా నుంచి జరుగుతున్నా, పెద్దమొత్తంలో డబ్బులు ట్రాన్స్ ఫర్ అవుతున్నా వాటికి సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నది.

ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఇలాంటి చర్యలకు రాజకీయ నాయకులు పాల్పడతారన్న ఉద్దేశంతో వాటిపై నిఘా వేసింది. అలాంటి లావాదేవీల విషయంలో నోటీసులు జారీచేసి అవి ఓటర్ల కోసం ఉద్దేశించినవి కావని ధృవీకరించుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం వివిధ శాఖల నుంచి సహకారం కోరి సమన్వయం చేసుకోవడంతో పాటు ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ ద్వారా విశ్లేషిస్తున్నది.

గత ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈసారి ఎన్నికల్లో ఆ తీవ్రత తగ్గించాలని భావించింది. అందులో భాగంగానే మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల మొదటి వారంలో వచ్చిన కేంద్ర ఎలక్షన్ కమిషనర్లు ప్రత్యేకంగా 21 రకాల రాష్ట్ర, కేంద్ర పోలీసు విభాగాలతో పాటు ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగాల ఉన్నతాధికారులతో రివ్యూ చేసింది.

తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసింది. పారదర్శక ఎన్నికల కోసం పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని సూచించింది. ప్రలోభాల పట్ల కఠినంగా వ్యవహరించాలని నొక్కిచెప్పింది. ఇందుకోసం నిఘా వ్యవస్థను ముమ్మరం చేయడంతో పాటు షాడో మెకానిజాన్ని రూపొందించింది.

రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టుల్ని పెట్టడంతో పాటు ఫ్లైయింగ్, స్టాటిక్ స్క్వాడ్‌లను రంగంలోకి దించింది. వందలాది కోట్ల రూపాయల నగదు, బంగారం, మద్యం తదితరాలు స్వాధీనం అయ్యాయి. ఇదంతా ఒక ఎత్తయితే, నియోజకవర్గాల్లో రాజకీయ నాయకులకు అనుచరులుగా ఉన్నవారి నుంచి భారీ మొత్తంలో ఆన్‌లైన్, డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయని అనుమానించింది.

దసరా పండుగ సందర్భంగా గడచిన వారం రోజుల్లో జరిగిన బల్క్ ట్రాన్సాక్షన్ల వివరాలను సేకరిస్తున్నది. నిర్దిష్టమైన కారణాలను తెలుసుకోడానికి కొద్దిమందికి నోటీసులు జారీ చేయాలని ఆలోచిస్తున్నది. జిల్లాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటే ఎప్పటికప్పుడు సీఈఓ ఆఫీస్‌కు వివరాలను అందించాలని కలెక్టర్లను ఆదేశించింది.

Advertisement

Next Story