Eatala Rajender: రేవంత్ రెడ్డికి సలహాలు ఎవరిస్తున్నారో అర్థం కావడం లేదు..ఈటల సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Eatala Rajender: రేవంత్ రెడ్డికి సలహాలు ఎవరిస్తున్నారో అర్థం కావడం లేదు..ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కంచే చేను మేసిన చందంగా ప్రజల భూములు లాక్కుని మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే కొడంగల్ లో భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అర్హత లేని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోదరుడు లగచర్ల (Lagacharla)కు వెళ్తే అహ్వానం పలికిన పోలీసులు ఎంపీ డీకే అరుణ వెళ్తే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. దందాల కోసమే హైడ్రాను సృష్టించారని, ప్రజల భూములు, ఆస్తులు లాక్కునే ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. పంటలు పండే భూములను ఫార్మా కంపెనీల కోసం రైతుల వద్ద నుంచి బెదిరించి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతుల నుంచి భూముల నుంచి వేరు చేయడం అంటే తల్లిని బిడ్డను వేరు చేయడం లాంటిదన్నారు. రైతులు ఒప్పుకోకపోయినా అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పిన తర్వాత కూడా రాత్రికి రాత్రి 1500 పోలీసు బలగాలను మోహరించి గ్రామాల మీదపడి గ్రామాల ప్రజలను అరెస్టులు చేశారని ఎందుకు అరెస్టులు చేస్తున్నారని అడిగిన పాపానికి కొట్టారని మండిపడ్డారు. ఇంటర్నెట్ ను బంద్ చేసి అరెస్టులు చేశారని ఓట్లేసినందుకు రేవంత్ రెడ్డి చూపిస్తున్న నిజస్వరూపం ఇది అన్నారు. సీఎంకు ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. గతాన్ని అవలోకనం చేసుకోవాలన్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో భూములు ఉన్నవారు తమ భూమి విలువ రూ.20 కోట్లు రూ.30 కోట్లకు పెరిగిందని సంతోష పడుతుంటే భూములు కోల్పోయిన వారు మాత్రం అదే ఎయిర్ పోర్టులో టాయిలెట్లు క్లీనింగ్ చేసుకునే దుస్థితి ఉందన్నారు. భూములు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఊడ్చే ఉద్యోగాలు, తూడ్చే ఉద్యోగాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో పోలేపల్లె సెజ్ విషయంలో ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. అధికారులను కూడా చెబుతున్నాను.. గతంలో వైఎస్సార్, నిన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాలలో ఏం జరిగిందో చూశాం. ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా పనిష్మెంట్ తప్పదన్నారు. గత ప్రభుత్వంలో భూసేకరణకు వస్తే తన్నితరమండి అని దుర్మార్గంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ మేము వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు.

మల్టీనేషనల్ కంపెనీలకు విద్యుత్ పై రాయితీ, ట్యాక్సీల రాయితీ, బ్యాంకుల నుంచి అతి తక్కువకే రుణాలు ఇస్తుంటే ఈ పేద రైతుల నుంచి భుములు చౌకకు కొట్టివేసే పనులు ఎందుకు అని ప్రశ్నించారు. మార్కెట్ ధరకు కంపెనీలే భూములు కొనుకుంటాయని ఎందుకు మధ్యలో ప్రభుత్వం బ్రోకర్ పని చేస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన వాగ్ధానాలు ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారన్నారు.

Advertisement

Next Story

Most Viewed