30వ తేదీన యాదాద్రిలో ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు

by Kalyani |   ( Updated:2022-12-28 13:50:50.0  )
30వ తేదీన యాదాద్రిలో ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు
X

దిశ, భువనగిరి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఈ నెల 30వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం సుప్రభాతం నుంచి మధ్యాహ్నం ఆరగింపు వరకు నిర్వహించే ఆర్జిత సేవలు, ప్రత్యేక ధర్మ దర్శనాలను రద్దు చేస్తున్నామని ఆలయ ఈవో గీత చెప్పారు. అలాగే ఉదయం 9 నుంచి 10 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నామని వెల్లడించారు. నిత్యకైంకర్యాలను అంతరంగికంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా ఇప్పటివరకు యాదాద్రిని నలుగురు రాష్ట్రపతులు మాత్రమే దర్శించుకోవడం విశేషం.

రాష్ట్రపతి పర్యటన ఇలా..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన ఉదయం 8.50 గంటలకు హైదరాబాద్‌లోని బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి ఈఎంఈ హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఏఎఫ్‌ ఎం17 హెలికాప్టర్‌లో యాదాద్రి దేవస్థానం వద్ద హెలిప్యాడ్‌ స్థలానికి చేరుకుంటారు. ఉ. 9.50 గంటలకు ప్రత్యేక వాహనంలో కొండపైకి బయల్దేరుతారు. ఉ.10 నుంచి 10.30గంటల మధ్య స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఉ.10.40 గంటలకి యాదాద్రి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. ఉ.10.50 గంటలకు తిరిగి హైదరాబాద్‌లోని బొల్లారం హెలిప్యాడ్‌ వద్దకు, 11.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed