మోడీ టూర్‌తో పొలిటికల్ హీట్.. బీజేపీని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ స్కెచ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-08 02:28:32.0  )
మోడీ టూర్‌తో పొలిటికల్ హీట్.. బీజేపీని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ స్కెచ్
X

రాష్ట్రంలో ప్రధాని మోడీ టూర్ కాక పుట్టిస్తున్నది. శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు వస్తున్న ప్రధానికి నిరసనలతో స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సిద్ధమయ్యాయి. నగరంలో ఇప్పటికే యాంటీ మోడీ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘సేవ్ సింగరేణి’ నినాదంలో బీఆర్ఎస్ పోస్టర్లు అతికించగా.. విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శిస్తూ ‘మోడీ గో బ్యాక్’ అంటూ సీపీఐ, సీపీఎం నినదిస్తున్నాయి. మరో వైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. మొత్తానికి మోడీ పర్యటనను వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడంతో యాంటీ బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. దీంతో బీఆర్ఎస్ ఈసారీ కూడా నిరసన ఫ్లెక్సీలతో ప్రధానికి స్వాగతం పలుకుతున్నది. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలతో ‘సేవ్ సింగరేణి’ నినాదంతో నగరంలో ఇప్పటికే పోస్టర్లను అంటించింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందనే అంశాలపై సీపీఐ, సీపీఎం పార్టీలు ‘మోడీ గో బ్యాక్’ నినాదాలు చేస్తున్నాయి.

బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల్లా వ్యవహరిస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తూ ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తున్నది. మోడీకి వ్యతిరేకంగా నిరసనలు చేసే విషయంలో విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. ఇంతకాలం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ ఘర్షణ పోటాపోటీ ఫ్లెక్సీలు, కార్యక్రమాలతో వేడెక్కింది. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారీ యాంటీ మోడీ ఫ్లెక్సీలను బీఆర్ఎస్ డిస్‌ప్లే చేస్తున్నది. బైబై మోడీ అంటూ ప్రధాని పాల్గొనే ప్రదేశాల సమీపంలో గోడలపై పోస్టర్లు అంటించేది.

కానీ ఈసారి మాత్రం సింగరేణి సంస్థను తెరపైకి తెచ్చి సేవ్ సింగరేణి హ్యాష్ ట్యాగ్‌తో ఫ్లెక్సీలను, పోస్టర్ల యుద్ధాన్ని మొదలుపెట్టింది. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను దశలవారీగా ప్రైవేటుపరం చేసే ఉద్దేశంతో బొగ్గు బ్లాకులను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నదంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల కామెంట్ చేశారు. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా సింగరేణి ప్రాంతాల్లో మహాధర్నాలు నిర్వహించి ప్రైవేటీకరణ కుట్రను బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు.

సెంటర్-స్టేట్ ఫైట్‌గా పొలిటికల్ హీట్

గతేడాది ఫిబ్రవరిలో సమతామూర్తి విగ్రహావిష్కరణ నుంచి ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఎడమొహం, పెడమొహంగా మారారు. ప్రొటోకాల్ లాంటివన్నీ గాలికి ఎగిరిపోయాయి. మర్యాదపూర్వక స్వాగతం, వీడ్కోలు సంప్రదాయం అటకెక్కింది. రాజకీయ పార్టీలుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య నెలకొన్న ఘర్షణ చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైషమ్యంగా మారింది. తెలంగాణను కేంద్ర ప్రభుత్వం శత్రుదేశంగా చూస్తున్నదని, వివక్షతో వ్యవహరిస్తున్నదని రాష్ట్ర మంత్రులు తరచూ ఆరోపిస్తున్నారు. గుజరాత్‌పై కనబరుస్తున్న ప్రేమను తెలంగాణపై ఎందుకు చూపడంలేదని ప్రశ్నిస్తున్నారు.

పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం చట్టబద్ధంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులనూ ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నదనీ విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలు సైతం ప్రతివిమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం ప్రధాని పర్యటిస్తుంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అవుతున్నారు. సుమారు రూ.11,355 కోట్ల ఖర్చుతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్వాగతించడంలేదని నిలదీస్తున్నారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందనేది నిజమే అయితే.. ఆ విషయంపై ప్రధానితో నేరుగా మాట్లాడటానికి సీఎం ఎందుకు జంకుతున్నారని ప్రశ్నిస్తున్నారు. మోడీ టూర్ సందర్భంగా ఎందుకు నిరసనలు చేస్తున్నారని నిలదీస్తున్నారు.

వారసత్వ రాజకీయాల పోస్టర్

మోడీ రాష్ట్ర పర్యటనకు రావడానికి రెండు రోజుల ముందు ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఆ అంశాన్ని బీఆర్ఎస్ ఉటంకిస్తూ ఆ పార్టీలో రాజకీయ వారసులుగా కొనసాగుతున్నవారి ఫొటోలను ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా నగర ప్రజలకు ఎక్స్‌పోజ్ చేసింది. ఇంకోవైపు ఒక్కో రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన స్కామ్‌లను ప్రస్తావిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం విపక్ష పార్టీలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదనే అంశాలను దేశ చిత్రపటంలో ప్రస్తావిస్తూ పోస్టర్లను ప్రదర్శించింది. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడంలో భాగంగా బొగ్గు బ్లాకులను అదానీకి అప్పజెప్పే కుట్ర జరుగుతున్నదంటూ మరికొన్ని పోస్టర్లలో పేర్కొన్నది.

విభజన హామీలపై లెఫ్ట్ పార్టీల నిరసన

విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంటూ సీపీఐ, సీపీఎం మోడీ టూర్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ హామీలపై సమాధానాలు చెప్పాలని నిలదీస్తున్నాయి. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం, కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా.. లాంటి అనేక అంశాలను రెండు వామపక్ష పార్టీలు ప్రస్తావించాయి. సింగరేణి సంస్థను కాపాడుకోడానికి బీజేపీ హఠావో అనే పిలుపుతో బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనకు రెండు లెఫ్ట్ పార్టీలు మద్దతు పలికాయి. బీఆర్ఎస్ నిరసనల్లో భాగస్వాములు కానున్నట్టు పేర్కొన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలపై ఉద్దేశపూర్వకంగానే బీజేపీ విరుచుకుపడుతున్నదని ఆరోపించాయి.

మరో వైపు కాంగ్రెస్

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ మోడీ టూర్‌ను వ్యతిరేకిస్తున్నది. ప్రశ్నపత్రాల లీక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పరిపాలనపై పట్టు కోల్పోయిందని బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ యువజన నేత శివసేనారెడ్డి ఆరోపించారు. బీజేపీ సైతం ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నదని విమర్శించారు. టెన్త్ హిందీ పేపర్ లీక్ విషయంలో బీజేపీ స్టేట్ చీఫ్‌పై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానిపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు.

Also Read: నేడు రాష్ట్రానికి ప్రధాని మోడీ..

Advertisement

Next Story

Most Viewed