డీటీసీపీతో గాలం..! అనుమతి లేకుండానే సేల్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-14 02:59:27.0  )
డీటీసీపీతో గాలం..! అనుమతి లేకుండానే సేల్
X

ములుగు జిల్లాలో రియల్​వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి అన్నీ అనుమతులున్నాయంటూ అమాయకులకు ప్లాట్లు అంటగంటే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా మారుతుందని తెలిసిన రియల్​వ్యాపారులు సమీప ప్రాంతాల వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా బోర్డులు పెట్టి విక్రయిస్తున్నారు.

మేడివాగు పరిసరాల్లో వెంకటసాయి డెవలపర్స్​పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్‌కు డీటీసీపీ అనుమతులు లేకుండా ఏకంగా కరపత్రాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన డీటీసీపీ అనుమతులు ఉన్నాయంటూ కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నారు. వెంచర్లలో రోడ్లు, మురికి కాలువలు, కరెంటు స్తంభాలు పాతి అన్నీ అనుమతులు ఉన్నాయి.. ఇక ఇల్లు కట్టుకోవడమే అంటూ ప్రచారం చేపడుతున్నారు. మరీ బాహాటంగానే అబద్దపు ప్రచారం చేస్తుంటే సంబంధిత అధికారుల కంటపడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా బోగస్​వెంచర్లతో కొనుగోలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

–దిశ, ములుగు ప్రతినిధి

దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్న నేపథ్యంలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇదే అదనుగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు డీటీసీపీ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నామంటూ సామాన్య జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. తమ వెంచర్ లోని ప్లాట్లను కట్టబెడుతూ ఒక కొత్త రకం భూదందాకు తెర తీస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రం ములుగు మున్సిపాలిటీగా మారుతుందని తెలిసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు ఇదే అదునుగా భావించి వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి హద్దురాలు పాతి వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని మేడివాగు పరిసరాల్లో వెంకట సాయి డెవలపర్స్ పేరుతో ఏర్పాటుచేసిన వెంచర్ నిర్వాహకులు డీటీసీపీ అప్రూవల్ ఉందంటూ సామాన్య ప్రజలకు ప్లాట్లు కట్టబెట్టేందుకు కొత్త రకం పంథా మొదలుపెట్టారు. తాము ఏర్పాటు చేసిన వెంచర్ కు డీటీసీపీ అనుమతులు ఉన్నాయంటూ కొనుగోలుదారులను నమ్మబలికి ప్లాట్లు కట్టబెడుతున్నారు.

డీటీసీపీ నిబంధనలు ఇలా!

డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నిబంధనల ప్రకారం వెంచర్ ఏర్పాటు చేసే ప్రదేశంలో రహదారులు, నీటి వసతి, మురుగు కాలువలు, వీధి దీపాలు నిర్మించి మరియు సంబంధిత గ్రామపంచాయతీకి కొంత స్థలం కేటాయించాలి. పనులన్నీ పూర్తయిన తర్వాత డీటీసీపీ బృందం పరిశీలించి తదుపరి సంబంధిత లేఔట్ యజమానికి డీటీసీపీ పర్మిషన్ జారీ చేయాల్సి ఉంటుంది. సదరు యజమాని డీటీసీపీ పర్మిషన్ తీసుకున్న తర్వాత నుంచి లేఔట్లలో అమ్మకాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, వెంచర్ ఏర్పాటుచేసిన ప్రాంతంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా తమకు డీటీసీపీ అనుమతి లభించిందని ప్రచారం చేసుకుంటున్నారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.

కొత్తరకం దందా..

ములుగు జిల్లాలో అక్రమ వెంచర్ల నిర్వాహకులు కొత్త దందాకు తెరలేపుతున్నారు. డీటీసీపీ పర్మిషన్ వచ్చాయంటూ మట్టితో రోడ్లు, చిన్నచిన్న డ్రైనేజీ పనులు చేసినట్టు హడావిడి చేసి అన్ని సౌకర్యాలు ఉన్నాయంటూ నమ్మబలుకుతున్నారు. బ్రోచర్లలో డీటీసీపీ పర్మిషన్ ఉన్న వెంచర్ లో ప్లాట్లు తీసుకోవడంతో భవిష్యత్తులో ఎలాంటి నిర్మాణాల కైనా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదంటూ చెబుతూ ప్లాట్లను కట్టబెడుతున్నారు. జంగాలపెల్లి మేడి వాగు సమీపంలో ఏర్పాటు చేసిన వెంకట సాయి డెవలపర్స్ వారు ఏర్పాటు చేసిన లేఅవుట్ డీటీసీపీ పర్మిషన్ తీసుకోకుండా నామమాత్రపు పనులను చూపిస్తూ ప్లాట్లు కొనే యజమానులకు కుచ్చుటోపి పెడున్నారు.

సొంతింటి నిర్మాణం కోసం స్థలాన్ని కొనుక్కోవడానికి ఆసక్తి చూపే మధ్యతరగతి వినియోగదారుడిని నిలువునా మోసం చేస్తున్నారు. డీటీసీపీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకొని మౌలిక సదుపాయాలు పూర్తి కాకుండానే అనుమతి లభించినట్లు వెంచర్ ముందు ఫ్లెక్సీలు, కరపత్రాల్లో గొప్పలు ప్రస్తావిస్తూ, వెంచర్ కు కొత్త హంగులు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షించి ప్లాట్లు కట్టబెడుతున్నారు. ఇంతలా కొందరు అక్రమార్కులు చెలరేగిపోతున్నా అటువైపు అధికారులు దృష్టి సారించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోవద్దు..

డీటీసీపీ అప్రూవల్ తీసుకోకుండా ప్లాట్లు అమ్ముతున్నట్టు నా దృష్టికి వచ్చింది. పర్మిషన్ లేని లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దు. డీటీసీపీ అనుమతులు ఉన్నాయా, లేవా అని పరిశీలించి మాత్రమే స్థలాలను కొనుగోలు చేయాలి. డీటీసీపీ అనుమతి ఉన్న వెంచర్లలో మాత్రమే ఇండ్ల నిర్మాణాల కోసం అనుమతులు మంజూరు చేయబడతాయని ప్రజలు గమనించాలి.

- డీఎల్​పీఓ దేవరాజ్

Advertisement

Next Story

Most Viewed