యాదాద్రిలో డ్రోన్ కలకలం

by Sathputhe Rajesh |
యాదాద్రిలో డ్రోన్ కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహా స్వామివారి ఆలయం వద్ద అపచారం జరిగింది. ఆలయంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. అనుమతి లేకుండా యాదాద్రి ఆలయాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తున్న విషయాన్ని గుర్తించిన ఆలయ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన సాయికిరణ్, జాన్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ద్వారా ఆలయాన్ని ఎందుకు చిత్రీకరిస్తున్నారు ఎవరి అనుమతితో ఇలా చేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆలయం గోపురాలపై విమానాలు ఎగరరాదని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను అమలు చేస్తున్నామని చెబుతున్న యాదాద్రిలో డ్రోన్ సంచరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో తిరుమలలోనూ ఓ డ్రోన్ సంచరించడం తీవ్ర దుమారం రేపింది. తాజాగా యాదాద్రిలోను ఇదే తరహా ఘటన జరిగింది. దీంతో తిరుమల ఘటనతోనైనా ఇక్కడి అధికారులు జాగ్రత్తలు తీసుకోలేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story