Father of Agni Missiles : ‘అగ్నిమ్యాన్‌’‌కు అధికార లాంఛనాలతో అంతక్రియలు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

by Ramesh N |   ( Updated:2024-08-16 14:58:30.0  )
Father of Agni Missiles : ‘అగ్నిమ్యాన్‌’‌కు అధికార లాంఛనాలతో అంతక్రియలు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘అగ్నిమ్యాన్‌’(అగ్ని క్షిపణి పితామహుడు)గా పేరొందిన అగ్ని క్షిపణుల రూపకర్తగా గుర్తింపు పొందిన ప్రముఖ డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ (84) హైదరాబాద్‌లో ఆగస్టు 15న తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌లో ఆగస్టు 17వ తేదీ శనివారం నాడు వీరి అంత్యక్రియలు జరగనున్నాయి. రక్షణ రంగంలో అగర్వాల్ చేసిన సేవలకు గుర్తింపుగా 1990లో పద్మశ్రీ , 2000లో పద్మభూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1983లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక భారత్ మిస్సైల్ కార్యక్రమంలో డా. అరుణాచలం, డా. ఏ.పీ.జె. అబ్దుల్ కలాం లతో కలిసి డా. ఆర్.ఎం. అగర్వాల్ పనిచేశారు.

హైదరాబాద్ లో అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబరేటరీ (ఏఎస్ఎల్)వ్యవస్థాపక డైరెక్టర్ గా కూడా అగర్వాల్ పనిచేశారు. 2005లో డిఫెన్స్ రీసర్చ్, డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) లో విశిష్ట శాస్త్రవేత్తగా పదవీ విరమణ చేసిన అగర్వాల్ హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకొని చివరి వరకు రక్షణ రంగానికి సేవలందించారు. భారత లాంగ్ రేంజ్ మిస్సైల్ టెక్నాలజీ రంగంలో దేశం స్వయం ప్రతిపత్తి సాధించడంలో విశేష సేవలందించిన అగర్వాల్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story