రాజీనామా చేయకండి... ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు: కిషన్ రెడ్డి

by Sathputhe Rajesh |
రాజీనామా చేయకండి...  ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు: కిషన్ రెడ్డి
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మీ పదవులకు మీరు రాజీనామా చేయవలసిన పని లేదు.. ప్రజలే మిమ్మల్ని వచ్చే ఎన్నికలలో ఇంటికి పంపిస్తారు అని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ జోస్యం చెప్పారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని తమ సొంత రాజ్యాంగ భావిస్తున్నారని ఫైర్ అయ్యారు.

అందిన కాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయలేక ఆ నిందలను కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధానమంత్రి పైన వేస్తున్నారని ఆరోపించారు. మా పాలన.. దేశానికి మార్గదర్శకం... మా పాలన అన్ని రాష్ట్రాలకు అవసరం అని సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారని తెలిపారు. దళితులను దగా చేసిండ్రు.. నిరుద్యోగులను మోసం చేసిండు... ఉద్యోగులకు జీతాలు లేకుండా చేసి ఆ తప్పులు తమపై ఎక్కడ పడతాయో అని ఎంతసేపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అతని మంత్రి వర్గానికి ఆరోపణలు చేయడం తప్ప అభివృద్ధి చేత కాదని చెప్పారు.

రాష్ట్రంలో చట్టబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఎద్దేవా చేశారు. వివిధ పార్టీల నుండి గెలిచిన పార్టీలో చేర్చుకొని.. తమ ఎమ్మెల్యేలు జాతి రత్నాలు అని చెప్పుకున్న ఘనత ఈ ముఖ్యమంత్రి కే చెల్లుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చివరకు ఉపాధ్యాయ, విద్యా సంబంధ సమస్యలపై ప్రభుత్వంతో పోరాడవలసిన ఎమ్మెల్సీలను సైతం నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్వేచ్ఛ లేదని తాము చెప్పిందే చేయాలి అని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నది ఈ పాలకులు కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ శాసనసభ ప్రగతి భవన్ కనుసన్నలలో నడుస్తుందన్నారు. ఎన్నికలు సైతం కలుషితమయ్యాయని తెలిపారు. గవర్నర్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఈ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. సచివాలయానికి రాని ఏకైక సీఎం కేసీఆర్ అని ఓ మంత్రి చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. సామాన్య ప్రజానీకానికి ప్రగతి భవన్‌కి వెళ్లడానికి అవకాశం లేదు. కానీ ఎంఐఎం లీడర్లు మాత్రం మోటార్ సైకిల్‌పై నేరుగా సీఎం బెడ్ రూమ్ వరకు వెళ్తారని మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

తాము నీతివంతులుగా చెప్పుకొని.. అవసరమైతే రాజీనామాలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రి వర్గం చెబుతోంది. మేము దేశంలో నీతివంతమైన పాలనను అందిస్తాం అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఏ మేరకు నీతివంతమైన పాలన అందుతుందో ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని హితవు పలికారు. మీరు రాజీనామాలు చేయవలసిన పనిలేదు. ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపించే రోజులు దగ్గరపడ్డాయి అని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శాంత కుమార్, పద్మజా రెడ్డి, శ్రీ వర్ధన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎగ్గని నర్సింలు, ఎన్ పీ వెంకటేష్, జయశ్రీ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story