'సమస్యలపై స్పందించని ప్రభుత్వం'.. ఒక వైపు డాక్టర్లు.. మరోవైపు ఎఎన్‌ఎంలు..?

by Vinod kumar |
సమస్యలపై స్పందించని ప్రభుత్వం.. ఒక వైపు డాక్టర్లు.. మరోవైపు ఎఎన్‌ఎంలు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక వైపు తెలంగాణ వైద్య విధాన పరిషత్ డాక్టర్లు.. మరోవైపు సెకండ్ ఏఎన్ఎంలు రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఏఎన్ఎంలు రోడ్డెక్కగా.. టీవీవీపీ డాక్టర్లు కూడా ఆందోళనలు, నిరసనలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లోని సమస్యలను వివరించాలని ఆయా సంఘాలు ప్రయత్నించినా..ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలు రావడం లేదని డాక్టర్లు, ఏఎన్​ఎంల సంఘాలు చెబుతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలు చేస్తున్నామని ఏఎన్​ఎంలు చెబుతుండగా.. డాక్టర్లు కూడా అతి త్వరలో వైద్య గర్జనకు ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు కోఠి టీవీవీపీ ప్రధాన కార్యాలయం ముందు డాక్టర్లు ఆందోళన చేశారు. కమిషనర్ డాక్టర్ అజయ్​కుమార్ సర్ధి చెప్పగా.. డాక్టర్లు తాత్కాలికంగా ఆందోళనలు వాయిదా వేశారు. ప్రభుత్వం నుంచి సానుకూలమైన నిర్ణయం రాకపోతే భారీ స్థాయిలో ఆందోళనలు చేపడుతామని టీవీవీపీ డాక్టర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ లో హాడావిడి కొనసాగుతున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ బీజీలో ఉండటం గమనార్హం.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 వేల మంది సెకండ్ ఏఎన్ఎంలు అన్ని జిల్లాల్లో అందోళన నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రుల ముందు దిష్టిబొమ్మలు దహనం, ప్లకార్డులతో నిరసనలు చేస్తున్నారు. తొలి విడత డీహెచ్ ఆధ్వర్యంలో చర్చలకు పిలిచినా.. సఫలం కాలేదు. దీంతో శనివారం సెకండ్ ఏఎన్ఎంలు రెండోసారి చర్చలకు వెళ్లనున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే హామీని బట్టి సమ్మెపై తదుపరి నిర్ణయం ఉంటుందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి నర్సింహ్మా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ ఏఎన్​ఎంలు స్ట్రైక్ కు దిగడంతో క్షేత్రస్థాయిలో హెల్త్ యాక్టివిటీస్​ లన్నీ పెండింగ్ పడ్డాయి. టీకాల పంపిణీ, గర్భిణీ స్త్రీలకు చెకప్ లు, మానిటరింగ్ వంటి అంశాల్లో సమస్యలు వస్తున్నాయని జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

డిమాండ్లు ఇవే..

కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని ప్రధాన డిమాండ్ ఆ ఉద్యోగులు తెరమీదకు తీసుకువచ్చారు. అయితే ఇది సాధ్యం కాదని ఇప్పటికే హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రభుత్వం తరపున తేల్చిచెప్పారు. కానీ కాంట్రాక్ట్ లో పనిచేసే సెకండ్ ఏఎన్‌ఎంలకు వెయిటేజ్ మార్కులు, ఏజ్ రిలాక్సేషన్ తో పాటు పోస్టుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వమే కోచింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సెకండ్ ఏఎన్ఎంలు పక్కకు పెట్టేశారు. రెగ్యులరైజేషన్ తప్ప తమకు వేరే అంశాలు అవసరం లేదని తేల్చి చెబుతున్నారు.

దీంతో సెకండ్ ఏన్​ఎంల యూనియన్​నాయకులకు టెర్మినేట్ నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయినట్లు తెలిసింది. ఇక వైద్య విధాన పరిషత్‌ను వెంటనే రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్​సెకండరీ హెల్త్ సర్వీసెస్‌గా మార్చాలని డాక్టర్లు కోరుతున్నారు. టీవీవీపీ ఉద్యోగులకు కూడా 010 పద్దు కింద ట్రెజరీ జీతాలు ఇవ్వాలనే డిమాండ్ లేవనెత్తారు. కాంట్రాక్ట్ సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. 317 జీవో సంబంధం లేకుండా ప్రమోషన్లు కల్పించాలని కోరుతున్నారు. ప్రతి నెల 1 తేదిన జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డీఎమ్‌హెచ్‌వోల తరహాలో డీసీహెచ్‌లను కూడా క్రియేట్ చేయాలని టీవీవీపీ డాక్టర్లు సర్కార్పై ప్రెజర్ తెస్తున్నారు.

Advertisement

Next Story