పిచ్చోని చేతిలో రాయి కామెంట్స్.. కేటీఆర్‌కు డీకే అరుణ కౌంటర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-06 09:17:00.0  )
పిచ్చోని చేతిలో రాయి కామెంట్స్.. కేటీఆర్‌కు డీకే అరుణ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ, టెన్త్ పరీక్షల లీకేజీ, కూతురి లిక్కర్ స్కామ్, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఖర్చంతా తనదేనని సీఎం కేసీఆర్‌పై జాతీయ చానళ్లలో వస్తున్న అంశాలను దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరదీశారన్నారు. అందులో భాగంగానే లేనిపోని ఆరోపణలతో బండి సంజయ్‌ని జైలుకు పంపించారన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

బీజేపీపై కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. తన‌ కుటుంబంపై వస్తోన్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చటానికే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆమె ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవిత తనంతట తానుగా ఫోన్లు ఇవ్వలేదని, ఈడీ అడిగితేనే కవిత ఫోన్లు తీసుకెళ్ళిందనే విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఫోన్లు ధ్వంసమైనట్లు రిపోర్టులో ఎక్కడా లేదన్నారు. ఈడీ విచారణలో ఏం జరిగిందో కవితకు ధైర్యముంటే బయటకు చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. బిడ్డకో న్యాయం.., ఇతరులకు మరొక న్యాయమా? అని ఆమె ప్రశ్నించారు.

అవినీతి ఆరోపణలపై కవితను ఈడీ విచారణ చేస్తే బీజేపీకి ఎలా ఆపాదిస్తారని ఆమె ఫైరయ్యారు. తాను చేసిన పాపం కేసీఆర్‌ను ఎన్నటికీ వదలదని డీకే అరుణ హెచ్చరించారు. బూతులు మాట్లాడటంలో తన తండ్రి కేసీఆర్‌ను కేటీఆర్ మించిపోయారని అరుణ చురకలంటించారు. బండి సంజయ్ అరెస్టును ఆమె తీవ్రంగా ఖండించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై ఇప్పటివరకు నోరె మెదపని మంత్రులు, ఎమ్మెల్యేలు బండి సంజయ్‌పై మాట్లాడటం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. గ్రూప్ వన్ సహా.. ప్రతి ప్రశ్నాపత్రం లీక్ అవుతోందని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఆమె ప్రశ్నించారు.

పిచ్చోని చేయిలో రాయి.. అనే సామెత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కే వర్తిస్తుందని డీకే అరుణ ధ్వజమెత్తారు. ప్రజలంతా పిచ్చోని చేతిలో రాయిని పెట్టామని మాట్లాడుకుంటున్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. పోలీస్ స్టేషన్‌లో సంజయ్‌తో తాను ఫోన్ మాట్లాడానని, అలాంటిది పోలీసులకు సంజయ్ ఫోన్ దొరకలేదని ఆబద్ధాలు చెప్పడంపై డీకే అరుణ ఫైరయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిష్పక్షపాతంగా ప్రజల కోసం పని చేయాలని ఆమె సూచించారు. వారి హోదా, గౌరవాన్ని పోగొట్టుకోవద్దన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారని, కేసీఆర్‌కు కొమ్ము కాసి, నియంత పోకడలకు మద్దతిచ్చే వారిని క్షమించబోరని డీకే అరుణ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed