మా ఓటు శాతం తగ్గలేదు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

by Javid Pasha |
మా ఓటు శాతం తగ్గలేదు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని, ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు గెలిచిన మాట వాస్తవమే అయినప్పటికీ బీజేపీ ఓట్ల శాతం మాత్రం ఏమాత్రం తగ్గలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2018 ఎన్నికల్లో 36 శాతం ఓట్లు సాధించి 104 సీట్లలో విజయం సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లోనూ 36 శాతానికి పైగా ఓట్లు సాధించిందన్నారు. అయితే మెజారిటీ సీట్లు గెలవడంలో మాత్రం తాము వెనుకబడినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో 18 శాతం ఓట్లు సాధించిన జేడీఎస్.. ఈ ఎన్నికల్లో 12 శాతమే ఓట్లు సాధించిందని ఆమె పేర్కొన్నారు. అనేక స్థానాల్లో జేడీఎస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు రావడం వల్లే ఈ 5 శాతం అదనపు ఓట్ షేర్ కాంగ్రెస్ కు సాధ్యమైందని ఆమె ఎద్దేవాచేశారు.

కర్ణాటక ఎన్నికల చివరి దశలో ఎంఐఎం, ఎస్డీపీఐ పార్టీలు తమ అభ్యర్థులను విరమించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లేందుకు కృషి చేశాయని, కాబట్టే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం, సీట్ల శాతం పెరిగిందన్నారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు కర్ణాటక రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాందిగా మారాయని, 4 దశాబ్దాలుగా కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మూడో ప్రత్యామ్నాయమైన(ఒకప్పటి జనతా పార్టీ, తర్వాత జనతాదళ్, ఇప్పుడు జేడీఎస్) పార్టీలు ఏమాత్రం రాజకీయంగా ప్రభావితం చూపించలేదని చురకలంటించారు. రాబోయే రోజుల్లో కర్ణాటకలో రెండు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉంటుందనే తీర్పును ఓటర్లిచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ మార్పునకు అనుగుణంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తమ ఎన్నికల ఎత్తుగడలను రూపొందించుకుంటుందని తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో దేశ సమగ్రతను, సమైక్యతకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించిందని డీకే అరుణ విమర్శలు చేశారు. మైనారిటీల ఓట్లను బుజ్జగించడం కోసం ఏ స్థాయికైనా దిగజారిందని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. దీన్ని కర్ణాటక ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల సమయంలో మైనారిటీలను బుజ్జగించేందుకు తీవ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలతో కలిసేందుకూ కాంగ్రెస్ సిద్ధమేనన్నట్లు వ్యవహరించిందని ఆరోపణలు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని ఏమాత్రం అనుకోవడం లేదని, గత ఎన్నికల్లో కర్ణాటకలో 105 సీట్లు గెలిచినా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక్కసీటు మాత్రమే సాధించడాన్ని గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, జేడీఎస్, ఎంఐఎం పార్టీలు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు కృషిచేశాయని డీకే అరుణ విమర్శించారు.

Advertisement

Next Story