కార్పొరేషన్ చైర్మన్ల అసంతృప్తి.. సీఎం దృష్టికి టాపిక్

by Mahesh |   ( Updated:2024-11-08 03:06:29.0  )
కార్పొరేషన్ చైర్మన్ల అసంతృప్తి.. సీఎం దృష్టికి టాపిక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రొటోకాల్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించినా కొన్ని శాఖల్లోని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని పలు కార్పొరేషన్లు, కమిషన్ల చైర్మన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టాఫ్‌ను, సౌలత్‌లు కల్పించడంలో ఫెయిల్ అవుతున్నారని మండిపడుతున్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆఫీసర్లపై సీరియస్‌గా ఉన్నారు. సమీక్షలు, శాఖల రివ్యూల్లో తమకు అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఫస్ట్ రౌండ్ 37 మంది కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించింది. ఆ తర్వాత రైతు, విద్యా, బీసీ తదితర కమిషన్లు వేసింది. కానీ యాభై శాతానికి పైగా కమిషన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అధికారులు, చైర్మన్ల మధ్య సమన్వయం ఉండటం లేదు. ఇదే అంశంపై ఒకరిద్దరు చైర్మన్లు సీఎంవో అధికారులకు వివరించినట్లు సమాచారం.

కీలక కమిషన్‌లో జీరో?

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను సక్రమంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో రైతు కమిషన్‌ను నియమించింది. ఇందుకు రైతుల పరిస్థితి పై సమగ్రమైన అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోదండరెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఈ కమిషన్‌కు బీఆర్కే భవన్‌లో ఆఫీస్ కేటాయించారు. కానీ, కనీస వసతులు, కమిషన్‌కు కావాల్సిన అధికారులు, సిబ్బంది లేక పరేషాన్ అవుతున్నామని స్వయంగా మెంబర్లు చెప్తున్నారు. చాంబర్లు ఏర్పాటు చేయడంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఛైర్మన్ కోదండరెడ్డి కోసం ఒక చాంబర్ ఏర్పాటు చేయగా అందులో డోర్ లేని వాష్ రూమ్ ఉన్నది.

అందులోకి వెళ్లాలంటే మరొకరు అక్కడ ఉండాల్సి వస్తుందని కమిషన్ మెంబర్లు వివరించారు. బాధ్యతలు తీసుకున్న మెంబర్లు భవానీరెడ్డి, చెవిటి వెంకన్న, గడుగు గంగాధర్‌లు చైర్మన్ రూమ్‌లోనే కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ సిచువేషన్ చూసిన ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్, తనకు ఈ పదవి వద్దే వద్దంటూ ప్రభుత్వంలోని కీలక పెద్దల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎంకు అత్యంత ప్రీతి కలిగిన వ్యవసాయ శాఖలో ఈ పరిస్థితిని చూసి కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు తమ సొంత టీమ్‌తో పనిచేయించుకోవాల్సిన వస్తుందని సమాచారం.


Advertisement

Next Story

Most Viewed