సర్కార్‌పై వికలాంగుల సమరం.. సమస్యల పరిష్కారానికి సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |
సర్కార్‌పై వికలాంగుల సమరం.. సమస్యల పరిష్కారానికి సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సర్కార్‌పై వికలాంగులు ఉద్యమం చేసేందుకు రెడీ అవుతున్నారు. పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు సిద్ధం కానున్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లకు రిక్వెస్టులు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ఆఫీసులు ముట్టడించేందుకు ప్లాన్ ​చేస్తున్నారు. అతి త్వరలో నిరసనల షెడ్యూల్ ​ప్రకటిస్తామని యూనియన్ ​నేతలు స్పష్టం చేశారు.

ఇప్పటికే వికలాంగులు సంక్షేమం యూనియన్ ఇంటర్నల్ మీటింగ్‌లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని తీర్మానించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 43.02 లక్షల మంది వికలాంగులు(ఒకటి, అంతకంటే ఎక్కువ వైకల్యాలు) ఉన్నట్లు యూనియన్ చెబుతున్నది. వీరంతా ఇప్పుడు రోడ్డెక్కి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు వికలాంగుల సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయాలని వికలాంగుల సంక్షేమ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

రాష్ట్ర జనాభాలో 12 శాతం..

రాష్ట్ర జనాభాలో 12.02 శాతం వికలాంగులు ఉన్నట్లు ప్రభుత్వం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని ప్రకారం సంక్షేమ పథకాల్లో 12 శాతం వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేయనున్నారు. ఇక నామినేటెడ్ పదవులలో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరనున్నారు. వారి కుటుంబాలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్​, వైకల్య ధృవీకరణ పత్రం కలిగిన వికలాంగులకు బస్సులు, రైల్వేలలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని యూనియన్​నేతలు రిక్వెస్ట్ చేస్తున్నారు.

మానసిక వికలాంగులు, మూగ, చెవిటి వికలాంగుల మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని యూనియన్​ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక 40శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు రాయితీ బస్సు పాసులు జారీ చేయాలంటున్నారు. ప్రస్తుతం మూగ, చెవిటి, మానసిక వికలాంగులు, అంధులకు 40 శాతం వైకల్యం ఉంటే బస్సు పాసులు ఇవ్వడం లేదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేయాలని ప్రపోజల్ పెట్టనున్నారు.

అంతేగాక ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగులకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉచిత కోచింగ్ ఇవ్వాలని, 40శాతం వైకల్యం కలిగిన వారికి యూడీఐడీ కార్డులు పంపిణీ చేయాలని కోరనున్నారు. ఆసరా పెన్షన్ల మంజూరుకు ఆదాయ పరిమితి నిబంధనను ఎత్తివేస్తూ జీవో 17ను వెంటనే రద్దు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి గ్రామంలో డీఆర్​డీఏ ద్వారా వికలాంగులకు ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, సామూహిక ప్రాంతాలన్నీ అవరోధరహితంగా మార్చాలని వికలాంగులు డిమాండ్ చేస్తున్నారు.

సంక్షేమ పథకాల్లో 5 శాతం కేటాయించాలి

-ఎం.అడివయ్య, వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి

వైకల్యం తీవ్రతను బట్టి బ్యాటరీ వీల్ చైర్స్, మోటరైజెడ్ వెహికల్స్ ఇవ్వాలి. ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్ ఇచ్చి పని కల్పించాలి. వికలాంగుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన ​అవసరం ఉన్నది. ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డు మంజూరు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 5శాతం కేటాయించాలి. వినికిడి పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేసి, అవసరమైన పరికరాలు ఇవ్వాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వమే ఉచితంగా ఆటిజం ట్రీట్ మెంట్ చేయాలి. ఆటిజం థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మహిళా వికలాంగులకు స్వయం ఉపాధి కోసం శిక్షణ కేంద్రాలు చేయాలి.

Advertisement

Next Story

Most Viewed