ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పాలకమండలి నియామకంపై సందిగ్ధత

by karthikeya |
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పాలకమండలి నియామకంపై సందిగ్ధత
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పాలకమండలి నియామకంపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఉన్న పాలకమండలి పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. నిబంధనల ప్రకారం కొత్త పాలక మండలి నియామకానికి ఆరు నెలల ముందే నోటిఫికేషన్ వేయాలి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. నియామకానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడలేదు. కొత్త పాలకమండలి నియామకంపై ఎలాంటి కసరత్తు జరగకపోవడంతో ఈఆర్సీ దారేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

హడావుడిగా పది మంది నియామకం..

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పాలకమండలి పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పాలకమండలి 30 అక్టోబర్ 2019లో బాధ్యతలు తీసుకుంది. ఈ నెల 29తో వారి పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం ఉన్న పాలకమండలిని పొడిగించే అవకాశాలు లేవు. కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయాల్సిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొనసాగుతున్న పాలకమండలి తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. హడావుడిగా ఇటీవల విద్యుత్ నియంత్రణ్ భవన్‌ను ప్రారంభించుకున్నారు.

అలాగే విద్యుత్ నియంత్రణ్ భవన్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదించిన ‌ఏఆర్ఆర్‌పై ఇటీవల బహిరంగ విచారణ జరిగింది. ఇవన్నీ ఇంత హడావుడిగా ఎందుకు చేపట్టడమనే విమర్శలు ప్రస్తుత పాలకమండలిపై ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈఆర్సీపై వస్తున్న ఈ విమర్శలకు తోడు ప్రస్తుత పాలక మండలి కొత్తగా 10 మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులివ్వడం విమర్శలకు దారితీసింది. పాలకమండలి పదవీకాలం పూర్తయ్యే 5 రోజుల ముందు అంత హడావుడిగా నియమించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed