తెలంగాణ బీజేపీలో ఆయన్ను లెక్కచేయడం లేదా?.. ఆహ్వానం ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి?

by Gantepaka Srikanth |
తెలంగాణ బీజేపీలో ఆయన్ను లెక్కచేయడం లేదా?.. ఆహ్వానం ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ.. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకున్నది. మెంబర్ షిప్ డ్రైవ్ ను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. ఈ టైమ్ లో రాష్ట్ర నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ జరుగుతున్నది. తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ ప్రోగ్రామ్ కు ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందలేదని సమాచారం. కనీసం శాసనసభాపక్ష నేత పేరును కూడా ఇన్విటేషన్ లో చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సభ్యత్వ నమోదుకు పార్టీ ఎమ్మెల్యేల అవసరం లేదనుకుంటున్నదా అనే అనుమానం పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రమంత్రి గా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయన పూర్తిస్థాయిలో పార్టీని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీన్ని అలుసుగా చూసుకుని రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కొంతమంది నేతలు లేనిపోని పెత్తనం చలాయిస్తూ పార్టీ ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నారని, ఏమాత్రం లెక్క చేయడంలేదని చర్చించుకుంటున్నారు.

ఇన్విటేషన్‌లో లేని ఏలేటి పేరు

సభ్యత్వ నమోదు ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మెంబర్ షిప్ డ్రైవ్ కోసం ప్రత్యేకంగా ఇన్విటేషన్ తయారు చేయించారు. అందులో కనీసం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేరు పెట్టలేదు. కానీ ఏలేటికి ఫోన్ చేసి కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన ఏలేటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలిసింది. మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం అందలేదని సమాచారం. అయితే పైడి రాకేశ్ రెడ్డి మాత్రమే ఈ ప్రోగ్రామ్ కి హాజరు కావడం గమనార్హం.

కొరవడిన సమన్వయం

స్థానిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకుని వెళ్లాల్సిన పార్టీ రాష్ట్ర నాయకత్వం అందులో ఫెయిలైందనే చర్చ జరుగుతున్నది. కిషన్ రెడ్డి ఎల్పీ నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రొటోకాల్ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని కొందరు పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఇన్విటేషన్ లో పేరు పెట్టకుండా, ఏదైనా కార్యక్రమం సందర్భంగా ఫొటోను సైతం పాస్ పోర్ట్ సైజ్ లో ముద్రించడం అవమానించడమేనని చెబుతున్నారు. రుణమాఫీ కాని రైతుల కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ విషయంలోనూ ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయలేదు. కేవలం కిషన్ రెడ్డి ఫొటో పెట్టి నామమాత్రంగా రుణమాఫీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి చేతులెత్తేశారు. బీజేపీలో ఏ ఎమ్మెల్యేను కదిలించినా.. ఇలాంటి ఉదాహరణలే చెబుతున్నారు.

కొందరిదే పెత్తనం?

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ రావు. బంగారు శృతి... ఎవరికి వారుగా పెత్తనం చలాయిస్తున్నారనే చర్చ బహిరంగంగానే జరుగుతున్నది. వారి సీటును పదిలంగా ఉంచుకోవడం కోసం ఎమ్మెల్యేలను పెద్దగా ఇన్వాల్వ్ చేయకుండానే కార్యక్రమాలు రూపొందిస్తున్నారని చర్చించుకుంటున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జిగా స్థానికంగా లేకపోవడంతో.. వారు ఆడిందే.. ఆట పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితి మారిందని చర్చించుకుంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలోనూ బీజేఎల్పీ నేతకు ప్రయార్టీ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలంతా కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తామని.. అందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని ఆరోపణలున్నాయి. పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే ఎమ్మెల్యే రాజాసింగ్ కు సైతం ప్రధాన కార్యదర్శులు ఫోన్ చేసి కార్యక్రమాలకు ఆహ్వానించిన దాఖలాలే లేవని తెలుస్తోంది. పార్టీ ప్రజాప్రతినిధులకు పార్టీ కాల్ సెంటర్ నుంచి కాల్ చేసి సమాచారమివ్వడాన్ని ఎమ్మెల్యేలంతా అవమానంగా భావిస్తున్నారని సమాచారం. టీబీజేపీలో ఇంత జరుగుతున్నా.. స్టేట్ ప్రెసిడెంట్ కి తెలియదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన సమ్మతి లేనిదే ఏదీ జరగదని చెప్పేవారు సైతం ఉన్నారు. మరి ఈ సమస్యపై జాతీయ నాయకత్వం ఎలా స్పందింస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed