- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక పాలనపై CM రేవంత్ ఫోకస్.. రేపు సచివాలయంలో కీలక భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు రెండు నెలలుగా రాజకీయాలపై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించనున్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో అడ్మినిస్ట్రేషన్ అంశాలపై రివ్యూలు చేయనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. భూమికి సంబంధించిన పలు అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకోడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ పలుమార్లు సమావేశపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. సచివాలయంలో గురువారం ధరణి కమిటీ సమావేశం కానున్నది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కూడా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఇరిగేషన్, విద్యుత్, త్రాగునీటి సరఫరా, విద్య, గ్యారంటీలతో పాటు హామీలు అమలు, విధివిధానాల రూపకల్పన, వీటికి అవసరమయ్యే ఆర్థిక వనరుల సమీకరణ తదితరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నది.
రానున్న ఖరీఫ్ సీజన్‌కు రైతులకు పంట పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించాల్సిన రైతుభరోసా స్కీమ్ అమలుపై త్వరలోనే వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ శాఖలతో రివ్యూ జరిగేందుకు కసరత్తు ప్రాథమిక స్థాయిలో మొదలైంది. ఇప్పటివరకు రైతుబంధు ఎలాంటి ఆంక్షలు లేకుండా గత ప్రభుత్వంలో అమలైనట్లుగానే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నది. కానీ సాగులో లేని భూములకు సైతం నిధులను రిలీజ్ చేయడం ద్వారా ప్రజా ధనం వృథా అవుతున్నదంటూ ముఖ్యమంత్రి రేవంత్ మొదలు చాలా మంది మంత్రులు వ్యాఖ్యానించారు. దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉన్నది. మొత్తం వ్యవసాయ భూమిలో దాదాపు 45% మేర సాగులోనే లేదని, అయినా రైతుబంధు సాయాన్ని గత ప్రభుత్వం విడుదల చేసిందని, ఇది వృథాయేనంటూ ప్రాథమిక అంచనాకు వచ్చింది.
దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుబంధు నిబంధనల్లో మార్పులు చేసే అవకాశంపై జోరుగానే చర్చలు జరిగాయి. నిజంగా ఆర్థిక సాయం అవసరమైనవారికి మాత్రమే ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయాన్ని ఇవ్వాలని, సాగులో లేని భూములకు ఇవ్వరాదనే సూచనలు, ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. దీంతో ప్రజా ధనాన్ని సద్వినియోగం చేయడంతో పాటు భూస్వాములు, కొండలు గుట్టలు, సాగు చేయకుండా వదిలేసిన భూములకు ఇవ్వరాదనే అభిప్రాయాలూ మంత్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీంతో వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖల అధికారులతో లోతుగా సమీక్ష జరిగిన తర్వాత రైతుభరోసాకు గైడ్‌లైన్స్ ఖరారు కానున్నాయి. ఆనవాయితీ ప్రకారం జూన్ నెల నుంచి ఈ నిధులను రైతులకు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులపైనా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.
రానున్న వర్షాకాలంలో గోదావరి, కృష్ణా జలాలను ప్రణాళికాబద్ధంగా వాడుకోవడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగాలుగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు రిపేర్ వర్క్స్ చేయాల్సిన దృష్ట్యా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫారసులు, జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చిన ఆదేశాలతో వర్షాలు కురిసే లోపే మరమ్మత్తు పనులు కంప్లీట్ కావాల్సి ఉన్నది. కానీ ఇప్పటికింకా కొలిక్కి రానందున ఆ సమయానికి పనులు పూర్తయ్యి నీటిని నిల్వ చేసుకుని, పంపింగ్ ద్వారా ఎగువకు పంపి రిజర్వాయర్లలోకి పంపడంపైనా ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌రెడ్డి రివ్యూ చేయనున్నట్లు సమాచారం. గతేడాది వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో కృష్ణా, గోదావరి జలాలు రాకపోవడం, వచ్చినవాటిని నిల్వ చేసుకోవడంలోని సాంకేతిక ఇబ్బందులతో రిజర్వాయర్లలో నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. భూగర్భ జల మట్టం సైతం పడిపోయింది.
ఈసారి వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా నీటిని పక్కా ప్రణాళికతో వాడుకోవడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టనున్నది. తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురుకావడంతో కర్ణాటక నుంచి కూడా కనీసంగా ఐదారు టీఎంసీలను తెప్పించుకోడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఈ వారంలోనే తొలి విడతగా 2.5 టీఎంసీలు వస్తాయని మంత్రి ఉత్తమ్ ఇటీవల తెలిపారు. ఇలాంటి ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు, లభ్యత, యాక్షన్ ప్లాన్ తదితరాలపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఇక విద్యాసంవత్సరం కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు ప్రభుత్వం రివ్యూ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నది.