Deputy CM Bhatti Vikramarka: ప్రజల సందేహాలను తీర్చండి

by Gantepaka Srikanth |
Deputy CM Bhatti Vikramarka: ప్రజల సందేహాలను తీర్చండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఎన్యుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka) సూచించారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే(Family Survey)‌పై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయని, కలెక్టర్లు ఎనుమరెటర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడితే ప్రజల సందేహాలు ఏంటో వెను వెంటనే తెలుసుకుని, వాటిని తీర్చే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని భట్టి ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా పెద్ద కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్న అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. ప్రశ్నావళి పకడ్బందీగా రూపొందించారని, ఎన్యుమరేటర్లకు బాగా శిక్షణ ఇచ్చారని, హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు.

ఈ దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇది.. మనం చూపే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం అవడం ఆధారపడి ఉంటుంద అని అన్నారు. యావత్ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుటుంబ సర్వేను గమనిస్తుందని, దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతి చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed