Mallu Bhatti Vikramarka : ఖర్గేతో భట్టి భేటీ.. ఎన్నికలపై బిగ్ ప్లాన్

by srinivas |   ( Updated:2024-10-18 16:13:42.0  )
Mallu Bhatti Vikramarka : ఖర్గేతో భట్టి భేటీ.. ఎన్నికలపై బిగ్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, పథకాలు అమలు వంటి విషయాలను ఏఐసీసీ ప్రెసిడెంట్ అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీని పీఎంను చేసేందుకు వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఏఐసీసీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎంకు సూచించినట్లు తెలిసింది. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురువేయాలని ఏఐసీసీ చీఫ్​ భట్టిని ఆదేశించారు. నేతల మధ్య సమన్వయం, ఎన్నికల ప్లాన్​ వంటివన్నీ సమర్ధవంతంగా ఉండాలని సూచించారు. దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత పెరిగిందని, సమన్వయంతో ముందుకు సాగితే విజయాలు వరిస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు భరోసా కల్పించేలా ఎన్నికల ప్రచారాలు ఉండాలని, ఈ మేరకు తగిన షెడ్యూల్‌ను తయారు చేసుకోవాలని ఏఐసీసీ చీఫ్​డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇదిలా ఉండగా, జార్ఖండ్ రాష్ట్రం నవంబర్ 13, 20 తేదీల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకునిగా నియమితులైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శుక్రవారం రాంచీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గోసేవ అయోగ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ రంజన్ ప్రసాద్ ఇతర నేతలు కాంగ్రెస్ శ్రేణులు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. అయితే మన స్టేట్ నుంచి ఎన్నికల అబ్జర్వర్లుగా ఏఐసీసీ ముగ్గురు మంత్రులను నియమించింది. జార్ఖండ్‌కు డిప్యూటీ సీఎం భట్టి, మహరాష్ట్రకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలను నియమించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed