విద్యుత్ శాఖకు ‘‘అప్పుల’’ షాక్.. భారీ నష్టాల్లో ఉన్నా దశాబ్ది వేడుకలు మాత్రం ఘనం!

by Satheesh |
విద్యుత్ శాఖకు ‘‘అప్పుల’’ షాక్.. భారీ నష్టాల్లో ఉన్నా దశాబ్ది వేడుకలు మాత్రం ఘనం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని డిస్కంలు ఏయేటికాఏడు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. ఆదాయం సంగతి దేవుడెరుగు.. రోజురోజుకూ అప్పులు పెరిగిపోతుండటంతో సంస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటున్నది. రాష్ట్రంలో ఏదైనా శాఖలో ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయంటే అది కేవలం విద్యుత్ శాఖలోనే. అలాంటి శాఖ సైతం నష్టాల్లో ఉండటం ఆందోళనను కలిగిస్తున్నది.

ఇదిలాఉండగా వినియోగదారులకు 24 గంటలు కరెంట్‌తో పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తీరు కారణంగానే సంస్థ నష్టాల ఊబిలో చిక్కుకుంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2015 నాటికి నష్టాలు రూ.2974 కోట్లు ఉంటే తొమ్మిదేండ్లలో రూ.45 వేల కోట్లకు చేరుకోవడం దీనికి నిదర్శనం. అప్పుల్లో ఉన్నా శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. సోమవారం (ఈ నెల 5న) ప్రత్యేకంగా ‘తెలంగాణ విద్యుత్ విజయోత్సవం’ పేరిట విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవ్వడం గమనార్హం.

పెరిగిన విద్యుత్ డిమాండ్

రాష్ట్రం ఏర్పడిన నాటికి స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుగా ఉంది. నేడు అది 18,567 మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం విద్యుత్ రంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.39,321 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నది. అయినా సంస్థ ఆదాయానికి మాత్రం గండిపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో సగానికిపైగా విద్యుత్ వసాయానికే ఖర్చవుతున్నది. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయానికే 65 శాతానికి పైగా వినియోగిస్తున్నారు.

కాగా గృహావసరాలకు, నాన్ డొమెస్టిక్, ఇండస్ట్రియల్, కాటేజ్ ఇండస్ట్రీస్, వీధి దీపాలు, సాధారణ అవసరాలు, టెంపరరీ అవసరాలకు మిగిలిన 35 శాతం కరెంట్‌ను వినియోగిస్తున్నారు. అయితే దరిదాపుగా 35 శాతం విద్యుత్ వినియోగం వల్ల వచ్చే ఆదాయంతోనే సంస్థను నెట్టుకురావాల్సిన పరిస్థితి దాపురించింది.

అందులో నుంచే వారికి వేతనాలు, ఇతర ఖర్చులను భరిస్తున్నది. దీనికితోడు మొండి బకాయిలు పేరుకుపోవడంతో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి సంస్థలను గట్టెంక్కించడం యాజమాన్యానికి సవాల్గా మారింది. ఇదిలాఉండగా రాష్ట్రంలో అన్ని విద్యుత్ప్లాంట్లు కలిపి 18,567 మెగావాట్ల కెపాసిటీని కలిగిఉన్నాయి. మరోవైపు 2014లో తెలంగాణలోని మొత్తం విద్యుత్ కనెక్షన్లు 1.11 కోట్లు కాగా ఈ ఏడాది మే 1వ తేదీ నాటికి ఆ సంఖ్య 1.78 కోట్ల కనెక్షన్లకు చేరింది.

ఏటా విద్యుత్ వినియోగం

2014‌‌-15 39,519

2015-16 41,045

2016-17 44,783

2017‌-18 50,442

2018‌‌-19 57,454

2019-20 58,515

2020-21 57,007

ప్రత్యామ్నాయ ఆలోచనలేవి?

తెలంగాణ ఏర్పాటు అనంతరం విద్యుత్ సమస్యను తీర్చేందుకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి విద్యుత్ ను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించడంలేదు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 14వ తేదీన గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. వినియోగానికి అనుగుణంగా కొత్త ప్లాంట్ల నిర్మాణం చేపట్టాల్సిన సర్కార్ అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తున్నది. ఇతర రాష్ట్రాల నుంచి అత్యధిక ధరలు చెల్లించి విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నది. తెలంగాణలో దాదాపు 8972 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ప్రైవేట్వ్యక్తుల నుంచి సర్కార్ కొనుగోలు చేస్తున్నది.

స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం జెన్కో ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు కేవలం రెండు మాత్రమే. ఒక ప్లాంట్ సంగం పూర్తికాగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిచేశారు. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ ఏడో దశలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక కేంద్రంతో పాటు పాటు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో మణుగూరు ఏడూళ్ల బయ్యారంలో 1080 మెగా వాట్ల ప్లాంట్ మాత్రమే కొత్తగా ఏర్పాటు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో భూపాలపల్లిలో 600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం చేపట్టగా.. తెలంగాణ ఏర్పడే నాటికే అది 60 శాతం పూర్తయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్లాంట్ ను పూర్తిచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా దామరచర్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 4,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఈ పనుల్లో తాత్సారం జరుగుతోంది. తాజాగా ఈ ప్లాంట్ కు పర్యావరణ అనుమతులపై సందిగ్ధం నెలకొన్నది.

వినియోగదారులపై భారం

నష్టాల నుంచి గట్టెక్కేందుకు విద్యుత్ సంస్థలు వినియోగదారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా భారాన్ని మోపుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను గృహ విని యోగదారులపై ఒక్కో యూనిట్ కు రూ.50 పైసల భారం మోపారు. ఎల్‌టీ గృహేతర, హెచ్‌టీ వినియోగదారులపై ఒక్కో యూనిట్ కు రూపాయి పెంచారు. ఈ చార్జీల పెంపుతో ప్రజలపై ఏటా రూ.5,596 కోట్ల భారం పడుతోంది. కరెంటు చార్జీలు పెంచినా లోటు తగ్గకపోవడంతో డెవలప్ మెంట్ చార్జీలతోపాటు అడిషనల్ కంజప్షన్ డిపాజిట్(ఏసీడీ) చార్జీల పేరిట డిస్కంలు వినియోగదారులపై ఎడాపెడా భారం మోపాయి. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో తాత్కాలికంగా బ్యాక్ స్టెప్ వేశాయి.

ఇదిలా ఉండగా 2023-24 ఏడాదికి గాను అడిషనల్ సర్ చార్జ్ గా కిలోవాట్ కు రూ.0.39 పైసలు పెంచింది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చింది. ఆరు నెలలు అంటే ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వినియోగదారుల ముక్కు పిండి వసూలు చేసుకునే అవకాశాన్ని ఈఆర్సీ డిస్కంలకు కల్పించింది. వాస్తవానికి ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు అడిషనల్ సర్ చార్జీలు కిలోవాట్ కు రూ.9.86 పెంచాలని ఈఆర్సీని కోరాయి. కానీ ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఈఆర్సీ కిలోవాట్ కు రూ.0.39 పైసలు మాత్రమే వసూలు చేసేందుకు అవకాశమిచ్చింది. డిస్కంలకు ఝలకిచ్చినా ఈ నిర్ణయం సామాన్యులకు ఎంతో కొంత భారాన్ని మిగిల్చినట్లయింది.

ఊరట

రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2015 నాటికి డిస్కంలు రూ.11,897 కోట్ల అప్పుల్లో ఉండేవి. ఉదయ్ పథకంలో భాగంగా వాటిలో 75 శాతాన్ని అంటే రూ.8,923 కోట్లను తెలంగాణ ప్రభుత్వం మళ్లించుకుంది. క్రమంగా డిస్కంల నష్టాల్లో కొంత శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. దీంతో 2017 నుంచి ఇప్పటి వరకూ రూ.13,955 కోట్లను డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. నష్టాలను ఏయేటికాయేడు తగ్గించుకోవడానికి కేంద్రం పలు సూచనలు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఏనాడూ అమలుచేసిన పాపాన పోలేదు.

సర్కారు.. బిల్లు చెల్లించట్లేదు

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఏండ్లుగా చెల్లించట్లేదు. ప్రభుత్వ శాఖల బిల్లులు గతేడాది నవంబర్ నాటికే 20,841 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఇందులో కేంద్ర ప్రభుత్వ శాఖల బిల్లులు 658 కోట్లు కూడా ఉన్నాయి. అయినా, ప్రభుత్వం ఆ విషయంపై దృష్టి సారించడంలేదు. మరోవైపు ప్రభుత్వ సబ్సిడీలు కూడా సకాలంలో అందకపోవడంతో డిస్కంలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయి. దీంతో ప్రభుత్వ కాయాలయాల పెండింగ్ బకాయిలకు చెక్ పెట్టేలా ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రక్రియను డిసెంబర్ 2023 నాటికి పూర్తిచేయాలని స్పష్టం చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అక్కర్లేదని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ అంశం ఎప్పుడు అమల్లోకి వస్తుందో వేచిచూడాలి.

నష్టాలకు కారణమిదే..

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 27.49 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. 2014లో 19.03 లక్షల కనెక్షన్లు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 8 లక్షల వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఇచ్చారు. ఒక్క వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందించేందుకు రూ.11,500 కోట్లను ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు సబ్సిడీగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందజేస్తున్నది. 22,23,475 దళిత గృహాలకు రూ.284.13 కోట్లు, 1,00,942 గిరిజన గృహాలకు రూ.192 కోట్లు ఖర్చు చేసినట్లు సర్కార్ చెబుతున్నది.

ఈ పథకం ఎక్కువమందికి చేరువ కాలేదన్నది క్షేత్రస్థాయి వాస్తవం కాగా, విద్యుత్ సంస్థలకు ఈ బకాయిలు సైతం చెల్లించడంలేదు. మరోవైపు నాయిబ్రాహ్మణకులు, రజకులకు 250 యూనిట్ల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. ఈ వర్గాలకు దాదాపు రూ.120కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. 5,467 పౌల్ట్రీ ఫారాలకు, 6097 పవర్ లూమ్ లకు, డెయిరీ ఫారాలకు యూనిట్ కు రూ.2 చొప్పున సబ్సిడీని అందిస్తోంది. ఇవన్నీ ప్రభుత్వమే భరించాల్సిన ఉంటుంది. కానీ ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో అందించట్లేదు. ఇది నష్టాలకు ప్రధాన కారణమవుతోంది.

డిస్కంల నష్టాలు (రూ.కోట్లలో)

2018-19 4339.89

2019-20 6056.54

2020-21 6686.31

2021-22 5812

మొత్తం 22897.14

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ బకాయిల విడుదల

నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన చాంబర్‌లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ బకాయిల విడుదలకు చెందిన ఫైలుపై సంతకం చేశారు. మే నెల బాకాయిలు రూ.958 కోట్లు విడుదల చేశారు.

అనధికారిక కోతలు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకమందు విచ్చలవిడిగా కరెంటు కోతలు జరిగేవి. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇచ్చేవారు. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి మారింది. రాష్ట్రం ఏర్పాటు అనంతరం ట్రాన్స్ మిషన్ నెట్ వర్క్ ని బలోపేతం చేయడానికి రూ.18.874 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. గ్రామాల్లో మెరుగైన విద్యుత్ పంపీణీ నెట్ వర్క్‌ను పునరుద్ధరించడానికి పల్లె ప్రగతి కార్యక్రమం కింద రూ.506 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.249 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేసింది. అంతేకాకుండా డిస్కంల ద్వారా 1,062 కొత్త 33/11 కేవీ సబ్-స్టేషన్లు, 3.89 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, 1.83 లక్షల కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఏర్పాటుచేశారు. అయినా ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. వ్యవసాయానికి అందించే విద్యుత్ కూడా 24 గంటలు ఇవ్వడంలేదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడికక్కడ కోతలు విధిస్తున్నారు.

విద్యుత్ ఉత్పత్తి వివరాలు

థర్మల్ విద్యుత్ = 6682.5 మెగావాట్లు(21 ఫిబ్రవరి 2023 నాటికి)

త్వరలో అందుబాటులోకి వచ్చేవి = 11,580 మెగావాట్లు(నిర్మాణంలో ఉన్నాయి)

జల విద్యుత్ = 5654.7 మెగావాట్లు

త్వరలో అందుబాటులోకి వచ్చేవి = 90 మెగావాట్లు(నిర్మాణంలో ఉన్నాయి)

సోలార్ విద్యుత్ = 5865 మెగావాట్లు

త్వరలో అందుబాటులోకి వచ్చేవి = 15 మెగావాట్లు(నిర్మాణంలో ఉన్నాయి)

బయో పవర్ = 1600 మెగావాట్లు

పవన శక్తి = 128.10 మెగావాట్లు

పేరుకుపోయిన ఖాళీలు

విద్యుత్ శాఖలో భారీగా ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందితోనే విధులు చేయించాల్సిన పరిస్థితి. రెగ్యులర్ ఉద్యోగులైతే భారీగా వేతనాలు అందించాల్సి వస్తుంది. ఇప్పటికే సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. అందుకే రిక్రూట్ మెంట్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జెన్ కో పరిధిలో ఈ ఏడాది 7 జనవరి నాటికి 1,200 ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది. కాగా అందులో 1,009 పోస్టులు భర్తీ చేసింది. మరో 191 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా 273 మందిని కారుణ్య నియామకాల కింద విధుల్లోకి తీసుకుంది. భూమి కోల్పోయిన వారి కోటాలో 551 మందిని తీసుకున్నారు. 3756 మంది ఆర్టీజన్లు ఉన్నారు.

పోస్ట్ గుర్తించిన ఖాళీలు భర్తీ చేసినవి

అసిస్టెంట్ ఇంజినీర్ 856 744

కెమిస్ట్ 42 38

కంపెనీ సెక్రటరీ 1 1

అసిస్టెంట్ మేనేజర్(హెచ్ఆర్) 33 18

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 42 41

సెక్యూరిటీ గార్డ్స్ 162 112

ఫైర్ మెన్ 64 55

మొత్తం 1200 1009

Advertisement

Next Story