- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాళేశ్వరానికి అనుమతి లేదు.. కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరె శ్రీరామ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు కట్టి 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న డిజైన్ అర్థవంతమైనదని, కానీ కొన్ని అబద్ధాలు చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని మేడిగడ్డకు తరలించిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఆరోపించారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే మహారాష్ట్రలో ముంపు ప్రాంతం ఉంటుందని, దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని మొదటి అబద్ధం చెప్పి బీఆర్ఎస్ పక్కదారి పట్టించిందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీరు ఉండదంటూ కేంద్ర జల సంఘం చెప్పిందని, కేవలం 67 టీఎంసీలు మాత్రమే ఉంటుందని చెప్పినట్లుగా నమ్మించి మేడిగడ్డ దగ్గర కొత్త ప్రాజెక్టు కట్టేలా డిజైన్ చేసిందని ఆరోపించారు. ఈ రెండు అబద్ధాలతో మేడిగడ్డ డిజైన్‌కు గత ప్రభుత్వం ప్లాన్ చేసిందన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడి పలు సంచలన విషయాలను వెల్లడించారు.
రీ-ఇంజనీరింగ్ భారీ తప్పిదం :
ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, రూ. 40 వేల కోట్లతోనే పూర్తయ్యేదని, గ్రావిటీ ద్వారానే నీటిని అందించడం ద్వారా ప్రతి ఏటా విద్యుత్ కోసం చేసే రూ. 10 వేల కోట్లు ఖర్చు ఆదా అయ్యేదని వెదిరె శ్రీరామ్ పేర్కొన్నారు. కానీ కాళేశ్వరం పేరుతో రీ-ఇంజనీరింగ్ చేయడం ద్వారా గరిష్టంగా రెండు లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే పెరిగేదని, కానీ ప్రతి సంవత్సరం నీటిని లిఫ్టు చేయడానికి అయ్యే విద్యుత్ ఖర్చు రూ. 10,500 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ప్రాణహితకు ఉమ్మడి రాష్ట్రంలోనే రూ. 11,917 కోట్లు ఖర్చయిందని, మరో రూ. 30 వేల కోట్లు ఖర్చు పెడితే 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేదన్నారు. కాళేశ్వరం పేరుతో రీ-ఇంజనీరింగ్ చేయాలనే ఆలోచన అతి పెద్ద తప్పిదమన్నారు.
జల సంఘం అనుమతి లేదు :
కాళేశ్వరం డిజైన్2కు కేంద్ర జల సంఘం అప్రూవల్ ఇవ్వలేదని వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. కేవలం హైడ్రాలజీ (నీట లభ్యత), అంతర్ రాష్ట్ర సమస్యలను మాత్రమే జల సంఘం స్టడీ చేసి అనుమతి ఇచ్చిందన్నారు. డిజైన్, ఇన్వెస్ట్ మెంట్ అప్రూవల్ (క్లియరెన్స్) ఇవ్వలేదని స్పష్టం చేశారు. బహుళార్థసాధక ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఏదేని రాష్ట్రంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఉన్నట్లయితే కేంద్ర జల సంఘం సంబంధిత ప్రాజెక్టుల డిజైన్ జోలికి వెళ్ళదని గుర్తుచేశారు. కాళేశ్వరం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీడీఓ డిజైన్‌ను రూపొందించినందున జల సంఘం దాన్ని పరిశీలించలేదని, అందువల్ల ఆ డిజైన్‌కు బాధ్యత మొత్తం సీడీఓ విభాగానిదే తప్ప జల సంఘానిది కాదని నొక్కిచెప్పారు. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ విషయంలోనూ రాష్ట్ర సీడీఓ బాధ్యత వహించాల్సిందే తప్ప జల సంఘానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
థర్డ్ టీఎంసీ ఆలోచన అర్థరహితం :
కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్లుగా మేడిగడ్డ దగ్గర నుంచి ప్రతీ రోజు 2 టీఎంసీల చొప్పున మొత్తం 96 రోజుల పాటు 195 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వాడుకోవచ్చని, 18.25 లక్షల ఎకరాలకు నీటిని అందించవచ్చంటూ చెప్పిందని వెదిరె శ్రీరామ్ గుర్తుచేశారు. కానీ థర్డ్ టీఎంసీ ఆలోచన చేసి రోజుకు 3 టీఎంసీల చొప్పున 65 రోజుల పాటు 195 టీఎంసీలను ఎత్తిపోసి వాడుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని పేర్కొన్నారు. ఏది చేసినా మొత్తంగా వాడుకోగలిగింది 195 టీఎంసీలేనని, సాగులోకి వచ్చేది 18.25 లక్షల ఎకరాలేనని, అలాంటప్పుడు థర్డ్ టీఎంసీ ఆలోచన చేసి అదనంగా రూ. 30 వేల కోట్లు ఖర్చు చేయడం అర్థం లేని పని అని ఆయన నొక్కిచెప్పారు.
జల సంఘం ప్రశ్నలకు సమాధానాల్లేవ్ :
థర్డ్ టీఎంసీ విషయంలో జల సంఘం మూడు ప్రధాన అంశాలను లేవనెత్తిందని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు లేవని వెదిరె శ్రీరామ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించలేదన్నారు. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సైతం థర్డ్ టీఎంసీ డీపీఆర్‌కు ఆమోదం లేదని తేల్చి చెప్పిందని గుర్తుచేశారు. థర్డ్ టీఎంసీ డిజైన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం సమర్ధించుకున్న తీరు సంతృప్తికరంగా లేదని జల సంఘం స్పష్టం చేసింది. విద్యుత్ వినియోగాన్ని యూనిట్‌కు రూ. 3 అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా అయ్యే రూ. 6.3 విషయాన్ని దాచిపెట్టిందన్నారు. దీంతో కాస్ట్ బెనిఫిట్ రేషియో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినదానికి భిన్నంగా 1:1.87కి పెరిగిందన్నారు. టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ)కి చెప్పిన అంశాలు కూడా తప్పుడువేనని పేర్కొన్నారు. ఈ మూడు కారణాలను జల సంఘం ప్రస్తావించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం లేదన్నారు.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత :
రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడం తప్పేమీ కాదని, ఆ బోర్డులో రెండు రాష్ట్రాల ప్రతినిధులే ఉంటారని, రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితోనే అప్పగింత ఉంటుందని వెదిరె శ్రీరామ్ తేల్చి చెప్పారు. ప్రాజెక్టుల ఆపరేషన్, మెయింటెనెన్స్ బాద్యతలను బోర్డుకు అప్పజెప్పడంతో రాష్ట్రాల హక్కులు, స్వేచ్ఛకు విఘాతమేమీ ఉండదన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే బోర్డు బాధ్యత అన్నారు. అసలు సమస్యంతా ట్రిబ్యునల్‌లోనే ఉన్నదన్నారు. రెండు రాష్టాల మధ్య నీటి వాటాను నిర్ణయించేది, వాటిని బోర్డు ద్వారా అమలు చేయించేదీ ట్రిబ్యునల్ అని గుర్తుచేశారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా నీటిని విడుదల చేయడం వీలుపడదన్నారు.
కేంద్ర జల సంఘం నుంచి కాళేశ్వరం డిజైన్‌కు, నిర్మాణానికి అనుమతి లేకపోగా థర్డ్ టీఎంసీకి కూడా లేదన్నారు. ప్రాజెక్టు సహా బ్యారేజీ లోపాలకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సీడీఓ విభాగానిదే బాధ్యత తప్ప కేంద్ర జల సంఘానికి సంబంధమే లేదని తేల్చి చెప్పారు.