- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అధికారంలో ఉండగా ఏకాన ఇవ్వకుండా డిమాండ్లా..? హరీష్ రావుకు సీతక్క కౌంటర్

దిశ, తెలంగాణ బ్యూరో : అర్హులైన ఉపాధి కూలీ కుటుంబాలన్నీంటికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందజేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఆదివారం మంత్రి సీతక్క కౌంటర్ఎటాక్చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూలీలకు ఏకాన ఇవ్వని నేతలు, ఇప్పడు డిమాండ్లు చేయడమేమిటని..? అని ప్రశ్నించారు. 500 కోట్ల రూపాయలున్న కోటిశ్వరులకు రైతు బంధు ఇచ్చి, రెక్కల కష్టం తప్ప ఏలాంటి ఆస్తి పాస్తులు లేని కష్టజీవుల పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. అపోహలు వీడి.. కూలీ భరోసాను స్వాగతించాలని సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉపాధీ కూలీలకు రెండు దఫాల్లో ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవబోతుందన్నారు.
యావత్ దేశం ఈ స్కీం పట్ల ఆసక్తి చూపుతుండగా.. తెలంగాణలోని కొన్ని రాజకీయ శక్తులు ఈ పథకంపై తప్పుడు గణంకాలతో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. "భూమిలేని ఉపాధి హమీ రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు" అని మేనిఫెస్టో లో కాంగ్రెస్ స్పష్టమైన హమీ ఇచ్చిందని తెలిపారు. ఇచ్చిన హమీకి కట్టుబడి ఏలాంటి భూమిలేని ఉపాధి హమీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామన్నారు. "ఆసరా పెన్షన్లతో సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కుటుంబం యునిట్ గా అమలవుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సైతం అదే నిబంధన వర్తిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధి హామీ పోర్టల్ అధికార లెక్కల ప్రకారమే 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 48,13,966 జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలున్నాయని మంత్రి తెలిపారు. ఇందులో 22.64 లక్షల కుటుంబాలు కనీసం ఒక్క రోజు కూడా ఉపాధి పనుల్లో పాల్గోనలేదని మంత్రి స్పష్టం చేశారు. కేవలం జాబ్ కార్డు కలిగి ఉన్నంత మాత్రాన ఉపాధి కూలీగా పరిగణించలేమని, కూలీ ద్వారా జీవనోపాధి పొందితేనే ఉపాధి కూలీగా పరిగణించబడినవారవుతారని పేర్కొన్నారు.
తెలంగాణలో పేరుకు 48,13,966 జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నప్పటికీ ..అందులో కనీసం ఒక రోజు ఉపాధీ హమీ పనుల్లో పాలుపంచుకున్న కుటుంబాలు 25.50 లక్షల వరకు ఉన్నాయన్నారు. కనిష్టంగా 20 రోజుల పాటు ఉపాధి కూలీగా పని చేసిన కుటుంబాలనే.. ఉపాధి హమీ ఆధారిత కుటుంబాలుగా పరిగణించగా సుమారు 17.26 లక్షల వరకు కుటుంబాలే 20 రోజుల పనిని పూర్తి చేసుకున్నాయని తెలిపారు. అయితే ఇందులో 11 లక్షలకు పైగా కుటుంబాలకు సొంత భూమి ఉండటంతో రైతు భరోసా లబ్దిదారులుగా ఉన్నారని, దీంతో ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి భూమి లేని 6 లక్షలకుపైగా ఉపాధి కూలీ కుటుంబాలుంటాయన్న అంచనాతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అయితే గత పాలనలో మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలతో రాజకీయ పక్షపాతంతో వ్యవహరించకుండా గ్రామ సభల్లోనే, ప్రజల సమక్షంలోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారులను గుర్తిస్తామన్నారు. గ్రామ సభల నిర్ణయాలకు గౌరవం ఇస్తూ...ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు అర్హత ఉన్న అన్ని ఉపాధి కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల ఆర్దిక చేయుత నిచ్చి అండగా ఉంటామని మంత్రి సీతక్క వివరించారు.