డేంజర్ బెల్స్ : డెడ్ స్టోరేజీకి చేరిన నాగార్జున‌ సాగర్.. నగరానికి తాగునీరు సమస్యలు తప్పవా?

by Shiva |   ( Updated:2024-01-23 11:33:19.0  )
డేంజర్ బెల్స్ : డెడ్ స్టోరేజీకి చేరిన నాగార్జున‌ సాగర్.. నగరానికి తాగునీరు సమస్యలు తప్పవా?
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి సమీపిస్తున్న తరుణంలో ప్రాజెక్టులు అన్ని ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ఎండాకాలం రాకముందే హైదరాబాద్ సిటీకి నీటి కరవు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున‌సాగర్‌ జలాశయం నీటి మట్టం 520 అడుగుల దిగువకు పడిపోవడంతో కుడి, ఎడమ కాల్వకు నీరు విడుదల చేయకపోవడంతో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో మొదటి సారిగా నాగార్జన సాగర్‌ ప్రాజెక్టులో నీటి మట్టం గతేడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో రిజర్వాయర్‌లో నీటి మట్టం 520 అడుగుల దిగువకు పడిపోయింది.

2022లో నాగార్జున సాగర్ నుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆగస్ట్ 11 నుంచి నవంబర్ 21 వరకు క్రెస్ట్ గేట్లను దశల వారీగా తెరిచి, సుమారు 1,200 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జున‌సాగర్‌లో పూర్తి స్థాయి రిజర్వాయర్ లెవెల్ 590 అడుగుల కంటే దిగువన 524.80 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 520 అడుగులు ఉంది. 510 అడుగుల వరకు మాత్రమే ఎలాంటి పంపింగ్ లేకుండా తాగునీటి కోసం తరలించి అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ జల వివాదం కారణంగా డెడ్ స్టోరేజ్ నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ చేసే అవకాశం ఇప్పట్లో కష్టమే. ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్ సిటీలో తాగునీటి కోసం ఇబ్బందులు తప్పవని నిపుణులు వెల్లడించారు.

తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాల్లోని సుమారు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరందించడంతో పాటు హైదరాబాద్‌తో సహా వివిధ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ నీరు కీలక‌పాత్ర పోషిస్తుంది. అయితే, గత రెండు నెలలుగా జలాశయం నీటి మట్టం 520 అడుగుల దిగువన ఉండడంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా ఖరీఫ్ పంటలకు నీరు విడుదల చేయలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో చీడపీడలతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు.

Advertisement

Next Story