శాండల్ వుడ్ ఫామ్ పేరుతో దందా.. ‘స్వర్గసీమ’ రియాలిటీ ఇదే..!

by Anjali |   ( Updated:2024-04-22 02:19:15.0  )
శాండల్ వుడ్ ఫామ్ పేరుతో దందా.. ‘స్వర్గసీమ’ రియాలిటీ ఇదే..!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సెగ్మెంట్ పరిధిలోని కొందుర్గ్ మండలం చెరుకుపల్లి గ్రామంలో ‘స్వర్గ సీమ సుకేతన’ అనే కంపెనీ కస్టమర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నది. ఫామ్ ల్యాండ్ పేరుతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నది. వెంచర్లలో హద్దురాళ్లకు బదులు మొక్కలు నాటుతూ సాగుభూమిగా చూపుతూ ప్లాట్లను విక్రయిస్తున్నారు. గుంటల లెక్కన రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో వెంచర్లలో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పంచాయతీ పరిధిలో వెంచర్ వేస్తే పది శాతం భూమిని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 33 ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ రియల్టర్లు అదేమీ పట్టించుకోవడం లేదు. అధికారులను మేనేజ్ చేస్తూ ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నారనే విమర్శలున్నాయి.

పక్కదారి పట్టించే ప్రకటనలతో..

కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇస్తున్నారు. అవి పక్కదారి పట్టించేవిగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తక్కువ రేటు ఆశచూపి అనుమతులు లేని ప్లాట్లను అంటగడుతున్నారనే విమర్శలున్నాయి. హైదరాబాద్‌లోని ప్రాజెక్టుల ఫొటోలను చూపుతూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా మొక్కలు పెంచుతామని చెబుతున్నా.. వెంచర్‌కి వచ్చి చూస్తే ఆ స్థాయిలో మొక్కలు కనిపించడం లేదు. ఎడారిలా కనిపిస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు సైతం కల్పించలేదు. తప్పుదారి పట్టించే ప్రకటనలతో మోసం చేస్తున్న స్వర్గసీమ సుకేతన నిర్వాహకుడు చండ్ర చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.

పూర్తి వివరాలు చెప్పకుండానే..

కొందుర్గు మండలం చెరుకుపల్లిలో సర్వే నంబర్లు 238, 239, 242, 246, 249, 250, 263 లలో 372 ప్లాట్లు ఏర్పాట్లు చేశారు. మ్యాప్‌లో ఎన్ని ఎకరాలనేది చెప్పలేదు. సుమారు వంద ఎకరాలలో చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎడారిలా కనిపిస్తున్న ఈ ప్రాంతంలో గజానికి రూ.10 వేలు మాత్రమే అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. వెంచర్ క్లోజింగ్ ఆఫర్.. 33 శాతం డిస్కౌంట్ అంటూ ఊదరగొట్టు ప్రకటనలు చేస్తున్నారు. కాగా, ఇక్కడ గవర్నమెంట్ వ్యాల్యూ రూ.1100 మాత్రమే ఉండగా.. దానికి పదింతల రేట్లకు అమ్ముతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌కు అతి చేరువలో షాద్ నగర్‌కు దగ్గరగా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. షాద్ నగర్ నుంచి కేవలం 25 నిమిషాల దూరం మాత్రమే అని సైట్ బ్రౌచర్‌లో ముద్రించారు. కానీ 40 నిమిషాలకు పైగానే సమయం పడుతుంది. హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రాంతాల నుండి సైట్‌కు వెళ్లాలంటే సుమారు 80 కిలోమీటర్లు. రెండు గంటలకు పైగానే సమయం పడుతుంది.

Advertisement

Next Story

Most Viewed