బొటానికల్ ఎకో స్పేస్ పేరిట ‘రియల్’ ఫ్రాడ్..

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-09 08:31:17.0  )
బొటానికల్ ఎకో స్పేస్ పేరిట ‘రియల్’ ఫ్రాడ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎవరి భూములు? ఎవరు అమ్మేస్తున్నారు? రెవెన్యూ రికార్డుల్లో ఎవరి పేరిట ఉన్నాయి? క్షేత్ర స్థాయిలో ఎవరి ఆధీనంలో ఉన్నాయి? .. ఇవన్నీ పక్కన పెట్టేసి రైతుల నుంచి భూములు ఇంకా కొనుగోలు చేయకముందే వందల ఎకరాల లే అవుట్లు అంటూ మార్కెటింగ్ చేస్తున్నారు. కనీసం వారికి అడ్వాన్స్ అమౌంట్ కూడా చెల్లించకుండానే అమ్మేందుకు మార్కెటింగ్ చేస్తున్నారు. జనం నుంచి సొమ్ము వసూలు చేయడం, వారి డబ్బుతోనే భూములను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

పైసా ఖర్చు, పెట్టుబడి లేకుండా కొన్ని కంపెనీలు రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ఏలేస్తున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టండి. ఏడాదిలో పెట్టుబడి తిరిగి తీసుకోండంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. వాళ్లకు సంబంధం లేని భూములపైనా వెంఛర్లు వేస్తున్నారు. ఐతే క్షేత్ర స్థాయిలో రాళ్లు పాతితే ఎక్కడేం ఉంది? ఎక్కడ ఏ రైతు భూమి? అక్కడి పరిస్థితులేమిటి? అనేది అర్ధమయ్యేది. అన్నీ కాగితాల్లోనే చూపిస్తున్నారు. బ్రోచర్లలో కలల ప్రపంచాన్ని చూపిస్తున్నారు.

ఊహా చిత్రాల్లో కొత్త లోకాన్ని చూపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఏరియాలో 100 ఎకరాల్లో డీటీసీపీ వెంచర్ వేశామంటూ రోహిత్ కన్ స్ట్రక్షన్ పేరిట జోరుగా ప్రచారం చేస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునే రీతిలో పెట్టుబడికి ఏడాది తిరగకుండానే సొమ్ము గ్యారంటీ అంటూ నమ్మిస్తున్నారు. ఎకరం ల్యాండ్ ని మీ పేరిటే రిజిస్ట్రేషన్ చేస్తాం.. డెవలప్ చేసిన తర్వాత 1500 గజాల జాగ ఇస్తాం. ఫామ్ ల్యాండ్ కావాలంటే 2904 గజాల స్థలం ఇచ్చేస్తామంటున్నారు. ఐతే ఇదంతా అప్పటికప్పుడేం కాదు. 14 నెలల తర్వాత మాత్రమే మీ ల్యాండ్ సొంతమవుతుంది. ఈ విషయాలేవీ అర్ధమయ్యేటట్లు చెప్పరు. ఇప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ కస్టమర్లకు ఫోన్లలో మాయాప్రపంచాన్ని చూపిస్తున్నారు.

ఫామ్ ల్యాండ్ కావాలా..

మీరు ఫామ్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? ఐతే ఇంకేం.. ది బొటానికల్ ఎకో లివింగ్ స్పేసెస్ లో పెట్టుబడి పెట్టండి. ప్రీలాంచ్ ఆఫర్ కింద స్వాగతం పలుకుతున్నాం. డీటీసీపీ ప్లాట్ గజానికి రూ.4666 మాత్రమే. ఫామ్ ల్యాండ్ గజానికి రూ.2400 మాత్రమే. 105 ఎకరాల ప్రెస్టిజియస్ మెగా ప్రాజెక్టు చేపట్టాం. ఎక్కడో కాదు.. ముంబాయి హైవేకి నాలుగు కి.మీ. దూరం. సదాశివపేటకి దగ్గర బుధేరాలోనే ఉన్నది.

ఇది డీటీసీపీ ప్రతిపాదిత లే అవుట్. ఫామ్ ప్లాట్లు కూడా ఆర్కిటెక్చరల్ వ్యాల్యూస్, ఆల్ట్రా మోడరన్ ఎమినిటీస్ కల్పిస్తున్నాం. 50 ఎకరాల డీటీసీపీ లే అవుట్, మరో 50 ఎకరాలు ఫామ్ ప్లాట్స్. ఇందులో షార్ట్ టెర్మ్, మిడ్ టెర్మ్, లాంగ్ టెర్మ్ ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఎన్నెన్నో సదుపాయాలు కల్పిస్తాం. మునిపల్లి మండల కేంద్రానికి కి.మీ. దూరంలోనే ఉన్నది. సదాశివపేటకు 5 నిమిషాలు, నిమ్స్ కి 8 కి.మీ. దూరమే. అరగంటలో ఐఐటీ హైదరాబాద్​కి చేరుకోవచ్చునంటూ ది బొటానికల్ ఎకో లివింగ్ స్పేసెస్ పేరిట రోహిత్ కన్ స్ట్రక్షన్స్ అనే సంస్థ చేపట్టిన ప్రాజెక్టుగా ప్రచారం చేస్తున్నారు.

పెట్టుబడి ప్లాన్

– రూ.70 లక్షలు పెట్టుబడి పెడితే ఎకరం స్థలం రిజిస్ట్రేషన్. 15 నెలల తర్వాత 1500 గజాల స్థలం ఇస్తారు. ఫామ్ ల్యాండ్ కావాలంటే 24 గుంటలు ఇస్తారు. బై బ్యాక్ ఆఫర్ రూ.1.05 కోట్లు.

– రూ.35 లక్షలు పెట్టుబడి పెడితే అరెకరం రిజిస్ట్రేషన్. 15 నెలల తర్వాత 750 గజాల స్థలం ఇస్తారు. ఫామ్ ల్యాండ్ కావాలంటే 12 గుంటలు మాత్రమే. బై బ్యాక్ ఆఫర్ రూ.52.5 లక్షలు

– రూ.18 లక్షలు పెట్టుబడి పెడితే ఎంవోయూ+పీడీసీ చేస్తారు. 15 నెలల తర్వాత 375 గజాల స్థలం. ఫామ్ ల్యాండ్ కావాలంటే 6 గుంటలు ఇస్తారు. బై బ్యాక్ ఆఫర్ రూ.27 లక్షలు.

బయటి వ్యక్తులకు నో వే

ఎవరైనా కస్టమర్ పెట్టుబడి పెట్టి వెచ్చిస్తే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పోల్కంపల్లిలోని వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రోహిత్ ఇన్ఫ్రా కంపెనీ తరపున సింగిరెడ్డి మోహన్ రెడ్డి అనే వ్యాపారి కస్టమర్లకు సేల్ డీడ్ చేస్తున్నారు. ఎకరం స్థలం మార్కెట్ విలువను రూ.2,24,910 మాత్రమే చూపిస్తున్నారు. ప్రచారంలో మాత్రం రూ.75 లక్షలుగా ఉండడం గమనార్హం. పైగా షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో నాలుగు వైపులా కంపెనీ ల్యాండ్ గానే చూపిస్తున్నారు. అంటే ఎటువైపునా రోడ్డు లేవు. భవిష్యత్తులో కంపెనీతో తెగతెంపులు చేసుకుంటే అమ్మకం కుదరదు. బయటి వ్యక్తులెవరైనా వచ్చి ల్యాండ్ కొనుగోలు చేయడం అసాధ్యం. కంపెనీ పెట్టే ఆంక్షలకు బలి కాకతప్పని పరిస్థితి.

ముందే వసూళ్లు

రైతుల నుంచి భూమి కొనుగోలు చేయడం, డెవలప్ చేయడం.. ఆ తర్వాత డీటీసీపీ లే అవుట్ అనుమతులు తీసుకోవడం.. అన్నీ పూర్తయిన తర్వాత ప్లాట్లు అమ్మొచ్చు. కానీ రోహిత ఇన్ఫ్రా అనే కంపెనీ 50 ఎకరాలు కూడా కొనుగోలు చేయలేదు. 100 ఎకరాలను మార్కెట్లో పెట్టింది. ఇదే అంశాన్ని ‘దిశ’ ప్రతినిధి మార్కెటింగ్ తో ఆరా తీయగా సగమే కొనుగోలు చేసినట్లు చెప్పారు. మిగతా సగం కూడా రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. సగం డీటీసీపీ, మరో సగం ఫామ్ ల్యాండ్స్ వెంచర్లుగా వివరించారు. 15 నెలల తర్వాతే స్థలాన్ని హ్యాండోవర్ చేస్తామన్నారు. మరి రైతులు వారి పొలాను అమ్మడానికి నిరాకరిస్తే పరిస్థితి ఏంటి? ఆ భూములపై వివాదాలు నెలకొంటే ఎలా? అందుకే ముందస్తు అమ్మకాల వైపు కన్నెత్తి కూడా చూడొద్దని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ భూమి కాకపోయినా మార్కెటింగ్ చేస్తున్న కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed