జమ కాని దళితబంధు డబ్బులు.. లబ్ధిదారుల్లో నిరాశ

by Sathputhe Rajesh |
జమ కాని దళితబంధు డబ్బులు.. లబ్ధిదారుల్లో నిరాశ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ 'దళితబంధు' పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంబంధిత మంత్రులు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా గడువులోగా లక్ష్యం నెరవేరలేదు. గత నెల 31 నాటికి రాష్ట్రం మొత్తం మీద 40 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలని, వారు ఎంచుకున్న యూనిట్లు పనిచేయడం మొదలుపెట్టాలని సీఎం టార్గెట్ ఫిక్స్ చేశారు. కానీ ఇప్పటివరకు 27 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమయ్యాయి. కేవలం 5,700 యూనిట్లు మాత్రమే పంక్షనింగ్‌లోకి వచ్చాయి. ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినా మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లోకి మాత్రం డబ్బులు జమ కాలేదు. డబ్బులు అందుకున్న లబ్ధిదారుల్లో దాదాపు 22 వేల మంది ఇంకా యూనిట్లను స్థాపించలేకపోయారు. దళితబంధు పథకం దేశంలోనే విప్లవం సృష్టిస్తుందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం సైతం దీన్ని అమలుచేయాల్సిన ఒత్తిడికి లోనవుతుందంటూ సీఎం సహా పలువురు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ పథకాన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుని పకడ్బందీగా అమలుచేయాలని పలు దఫాలుగా సమావేశాలను ఏర్పాటుచేసి మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు, జిల్లాల కలెక్టర్లకు, ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. విపక్షాలకు చెందినవారినీ ఈ సమీక్షలో భాగస్వాముల్ని చేశారు.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలో ఉనికిలోకి వచ్చిన ఈ పథకంపై అనేక వేదికల మీద సీఎం స్వయంగా గొప్పగా ప్రకటనలు చేశారు. కానీ ఆచరణలో మాత్రం సీఎం ఆశించినంత ప్రగతికి నోచుకోలేకపోయింది. హుజూరాబాద్ సెగ్మెంట్ లో దళిత కుటుంబాలన్నింటికీ తలా రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని పలు సందర్భాల్లో సీఎం చెప్పారు. ఆర్థిక శాఖ సైతం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చేసింది. కానీ ఆ నియోజకవర్గంలో ఇప్పటికి లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లు గ్రౌండ్ అయింది కేవలం 2,600 పైచిలుకు మాత్రమే. ఈ విషయాన్ని పథకం పర్యవేక్షిస్తున్న అధికారి ఒకరు వివరించారు. రాష్ట్రం మొత్తం మీద 40 వేల మందిని టార్గెట్‌గా పెట్టుకున్నా అందులో 5,700 మందికి మాత్రమే యూనిట్లు మంజూరై ఫంక్షనింగ్‌లోకి వచ్చినట్లు వివరించారు. చాలాచోట్ల క్యాబ్ సర్వీసులుగా నడుపుకునేందుకు కార్లు, గ్రామాల్లోనే స్వయం ఉపాధిగా ఉండేందుకు ట్రాక్టర్లు కొనుక్కోడానికి అప్లికేషన్లు పెట్టుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాతి స్థానంలో ఎక్కువగా డెయిరీల కోసమే దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు.

హుజూరాబాద్‌లో సుమారు 2,600 యూనిట్లు, వాసాలమర్రిలో 60 యూనిట్ల చొప్పున లాంచ్ కాగా.. మిగిలినవి వివిధ నియోజకవర్గాలకు చెందినవి అని అధికారి వివరించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లు దీర్ఘకాలంలో ఆర్థికంగా నిలదొక్కుకుంటాయా? వారికి తగిన ఆదాయ వనరులు సమకూరే అవకాశం ఉన్నదా? తదితర పలు అంశాలపై కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కలిగించే ప్రక్రియ జరుగుతున్నదని, ఎక్కువ సమయం దీనికే పడుతున్నదంటూ ఆ అధికారి వివరించారు. ఇందుకోసం వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని సమీకరించి లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో ఆచరణాత్మక ఇబ్మందులు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక శాఖ నుంచి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ వచ్చినా దానికి తగినట్లుగా నిధులు కలెక్టర్ ఖాతాలో పడకపోవడం, లబ్ధిదారుల యూనిట్లపై తుది నిర్ణయం జరగకపోవడం తదితర కారణాల రీత్యా యూనిట్లు గాడిన పడడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి (2022-23) రాష్ట్రం మొత్తం మీద రెండు లక్షల మంది లబ్ధిదారులకు డబ్బులు జమ చేసేందుకు వీలుగా రూ. 17,700 కోట్లను బడ్జెట్‌లో సర్కారు కేటాయించింది. గతేడాది అనుకున్న పరిమిత లక్ష్యాన్ని పూర్తి చేయడానికే ప్రాక్టికల్ సమస్యలు తలెత్తినందున ఈ సంవత్సరం ఏకంగా రెండు లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక, వారి యూనిట్ల ఫంక్షనింగ్, నిధులను వారివారి ఖాతాల్లో జమచేయడంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళన ప్రభుత్వ సిబ్బందిలో వ్యక్తమవుతున్నది.

Advertisement

Next Story

Most Viewed