CV Anand : డీజే సౌండ్స్ కంట్రోల్ కోసం మత పెద్దలతో సీవీ ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం

by Prasad Jukanti |
CV Anand : డీజే సౌండ్స్ కంట్రోల్ కోసం మత పెద్దలతో సీవీ ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఊరేగింపుల్లో డీజే శబ్దాలు, టపాసుల వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని సిటీ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డీజే శబ్దాలపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ర్యాలీలో డీజే, టపాసుల వాడకంపై గురువారం జూబ్లీహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ సైబరాబాద్, రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. డీజీ శబ్దాలతో గుండెలు అదిరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి వల్ల ఇళ్లలో వృద్ధులు, చిన్నారులు అనే ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీల్లో డీజేలు పెట్టి దాదాపు 15-20 గంటల పాటు యువకులు పబ్ లలో మాదిరిగా నృత్యాలు చేశారని, ఈ ర్యాలీలలో తమకు కొత్త అనుభవాలు ఎదురయ్యాయన్నారు. శరీరాలు అదిరే రీతిలో శబ్దాలు ఉన్నాయన్నారు. గడిచిన రెండేళ్లుగా డీజేల ద్వారా శబ్ద కాలుష్యం జరుగుతున్నా ఈ ఏడాది అది శృతిమించిందన్నారు. ఈ విషయంపై సీఎంతో పాటు ఉన్నతాధికారులు ఆరా తీశారని చెప్పారు. యువకుల తీరుపై మత పెద్దలతో పాటు అందరినీ షాక్ కు గురి చేసిందని దీంతో వారంతా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరారన్నారు. ఈ నేపథ్యంలో డీజీలు, టపాసుల నియంత్రణ కోసం కలిసికట్టుగా నిర్ణయం తీసుకునేలా ఏకాభిప్రాయం కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ మీటింగ్ నివేదికను ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తామన్నారు. దాని ఆధారంగా త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామన్నారు. వీటిని ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే దాని ప్రభావం ఆరోగ్యంపై మాత్రమే కాకుండా లా అండ్ ఆర్డర్ పై కూడా ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed