కోటి ఓట్లు టార్గెట్.. CM KCR మైండ్ బ్లోయింగ్ స్కెచ్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-02 06:12:06.0  )
కోటి ఓట్లు టార్గెట్.. CM KCR మైండ్ బ్లోయింగ్ స్కెచ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే 115 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన కారు పార్టీ కోటి ఓట్లు టార్గెట్‌గా మరో మైండ్ బ్లోయింగ్ స్కెచ్ వేసింది. ప్రభుత్వ పథకాలు పొందిన వారితో పాటు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ఉద్యోగులు, కార్మికులు టార్గెట్‌గా మరో వ్యూహన్ని అమలు పరిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మొత్తం 30 లక్షల కుటుంబాలను రానున్న 50 రోజుల్లో కలిసి తమకు ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరనుంది.

రైతులు, మైనార్టీ ఓట్లే టార్గెట్..

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి రైతులకు సీఎం కేసీఆర్ టాప్ ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తున్నారు. మొత్తం 58.33లక్షల మంది రైతులు తెలంగాణలో ఉండగా వారి ఓట్లపై కేసీఆర్ కన్ను వేశారు. రైతుబంధు, రైతు బీమాతో ఇప్పటికే వారికి చేరువైన సీఎం ఇటీవల రైతు రుణ మాఫీ చేసి రైతుల ఓట్లు దండుకునేలా ప్లాన్ చేశారు. రైతు రుణమాఫీ లబ్ధిదారులు 9.02లక్షల మందిని నేరుగా కలిసేలా వ్యూహాలు రచిస్తున్నారు.

వీరితో పాటు 40 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల మైనార్టీ ఓటర్లను ఆకర్షించేలా ఇప్పటికే పలు పథకాలను కేసీఆర్ అమలు పరుస్తున్నారు. షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయంతో పాటు వారికి మండల కేంద్రాల్లో షాదీ ఖానాలు నిర్మించారు. ఇటీవలే మైనార్టీ బంధు కూడా ప్రకటించారు. మైనార్టీ బంధు లబ్ధిదారులు 2.5లక్షలు ఉండగా వారి ఓట్లపై కారు పార్టీ కన్నేసింది.

స్కీం బెనిఫీషియర్స్, ఉద్యోగులు..

వీరితో పాటు గృహలక్ష్మీ పథకం ద్వారా మహిళలను ఎన్నికల నాటికి తమ వైపునకు తిప్పుకునేలా గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారు. బీసీ బంధు ద్వారా లబ్ధి పొందిన వారితో పాటు రెగ్యులరైజ్ చేసిన వీఆర్ఏలు 20,400, 6000 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, 43,373 మంది టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను, వారి కుటుంబాలను నేరుగా కలిసి తమకు ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని కోరేలా యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. వీళ్లందరిని కేటగిరి వైజ్‌గా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేలా గులాబీ పార్టీ ప్లాన్ చేసింది. రెండు టర్మ్‌లు కలిసొచ్చిన పథకాలు మూడో టర్మ్‌లో బీఆర్ఎస్ పార్టీకి కలిసొస్తాయా లేదా అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed