కేసీఆర్ పింఛన్​దారులెవ్వరు.. కాంగ్రెస్‌లో కలకలం రేపుతోన్న KVP రీ ఎంట్రీ!

by GSrikanth |   ( Updated:2022-09-17 23:30:40.0  )
కేసీఆర్ పింఛన్​దారులెవ్వరు.. కాంగ్రెస్‌లో కలకలం రేపుతోన్న KVP రీ ఎంట్రీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: "మా పార్టీలోనే కేసీఆర్ దగ్గర నెల నెలా పింఛన్ తీసుకుంటున్నవాళ్లున్నరు. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కేవీపీ వచ్చి మళ్లీ వాళ్లందరినీ దగ్గర చేసి, కేసీఆర్‌కు భరోసా నింపుతున్నడు తప్ప కాంగ్రెస్​ పార్టీకి ఏం చేయడు. నెల పింఛన్లు తీసుకునేవారున్నంత వరకు పార్టీ ఇలాగే ఉంటది.." ఇది ఓ ఏఐసీసీ నేత బహిరంగంగా చేసిన విమర్శ. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు కోవర్టు అంశంపై తీవ్ర చర్చగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నేతలు మొత్తం కోవర్టులు అనే విధంగా పార్టీ కేడర్‌లో ప్రచారం జరుగుతోంది. ఏలేటి దావత్‌కు కేవీపీ రావడంతో రాష్ట్ర పార్టీలో ఒకవిధమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. మళ్లీ తెర వెనుక రాయబారంతో రాజకీయం మొదలుపెట్టారని భావిస్తున్నారు.

కోవర్టులకు కాస్ట్లీ కవర్స్​

కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారనే ప్రచారం కొత్తేమీ కాదు. ఎనిమిదేండ్ల నుంచి జరుగుతున్నదే. కేవలం కాంగ్రెస్‌లోనే కాకుండా బీజేపీ, వామపక్షాలు.. అన్నిచోట్లా కోవర్టులను నియమించుకున్నారని, వారికి ప్రతినెలా కాస్ట్లీ కవర్స్ వెళ్తున్నాయని తాజాగా ప్రచారమవుతోంది. ప్రతినెలా 30వ తేదీ నుంచి 1వ తారీఖులోపే ఆయా కోవర్టు నేతల ఇండ్ల వద్దకు వెళ్లి నెలావారీగా కేసీఆర్ పింఛన్ (లక్షల్లో నగదు) ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్​ పార్టీలో ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది. కానీ, గతేడాది టీపీసీసీ చీఫ్‌గా రేవంత్​ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్​పార్టీలో మార్పులు వస్తాయని భావించారు. పలు సందర్భాల్లో కోవర్టుల అంతు చూస్తామంటూ కూడా హెచ్చరించారు. కానీ, ఉన్నతస్థాయిలో ఉన్న కేసీఆర్ కోవర్టులు మారడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీలక నేతలు కేసీఆర్​ చేతికి చిక్కారని పార్టీ కేడర్‌లో విమర్శలున్నాయి.

కేసీఆర్ కోసం కేవీపీ గేమ్​

తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు కలిసి వచ్చే విధంగా ఏకంగా 40 స్థానాల్లో ఓడిపోయే నేతలకు కాంగ్రెస్ పార్టీ తరుపున టికెట్ ఇప్పించారనే అపవాదు ఇప్పటికీ కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహా కూటమి వెనక చక్రం తిప్పినట్లు కూడా ఆరోపణలున్నాయి. అయినప్పటీకీ కేవీపీ రాష్ట్ర నేతలను చేజారకుండా తన పట్టులోనే ఉంచుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్​నేతలకు ఆర్థికపరమైన అంశాల్లో కేవీపీ అండగా ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అందుకే రాష్ట్ర నేతలంతా కేవీపీ చెప్పినట్లే వింటున్నారంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని కాంగ్రెస్​నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, వివాదాలకు దిగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏపీ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు ఎంటర్ కావడం కాంగ్రెస్‌లో హల్‌చల్ చేస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే కేవీపీ వచ్చి వెళ్తారని కాంగ్రెస్​నేతలు చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే గతంలో రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోవర్టుల కథ తాజాగా చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్‌కు మళ్లీ రాజకీయ లాభం చేసేందుకే కేవీపీ దర్శనమిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా కేవీపీ కుటుంబానికి చెందిన కాంట్రాక్ట్ సంస్థకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పనులు అప్పగించినట్లు హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో తనకు కావాల్సిన పనులు చక్కబెట్టుకుంటూనే.. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలను చేజారిపోకుండా చేసుకుంటూ అదే సమయంలో కేసీఆర్‌కు లాభంచేసేందుకు కేవీపీ తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టారంటూ పార్టీ నేతలు వాపోతున్నారు.

రెండు వర్గాలకు కేవీపీ గురువు

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందంటున్న హస్తం నేతలు స్వయంకృపారాదంతో దాన్ని చేజార్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తెరపైకి ఒక వర్గాన్ని, తెర వెనుక ఇంకో వర్గాన్ని మెయింటెన్​చేసే ఏపీ నేత కేవీపీ రామచంద్రారావు.. రెండు వర్గాలను తనదైన శైలిలో వెనకేసుకొస్తున్నారనే చర్చ జరుగుతోంది. రేవంత్​రెడ్డిని వ్యతిరేకిస్తున్న నేతలకు కూడా ఆయనే వెనకుండి ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. అదే సమయంలో రేవంత్‌కు సైతం అనుకూలంగా ఉంటున్నారనే ప్రచారం ఇంకోవైపు జరుగుతోంది. ఇలా రెండు వర్గాలను తన గుప్పిట పెట్టుకుని.. సీఎం కేసీఆర్‌కు లాభం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల భావన.

తాయిలాలు పెంపు

కేసీఆర్ నుంచి ప్రతినెలా నగదు రూపంలో కోవర్టులకు అందుతున్నాయనేది బహిరంగ విమర్శే. ప్రస్తుతం కొంతమందికి లక్షలకు లక్షలు ఇస్తుండగా.. వారందరికీ ఇచ్చే కోవర్టు ప్రతిఫలాలను పెంచేందుకు కేవీపీ రూపంలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం. ఈసారి కూడా కాంగ్రెస్‌లో మళ్లీ పాత కథే ముందుకు వస్తుందనే విమర్శలు సైతం ఉన్నాయి.

విభేదాలే కేసీఆర్‌కు అనుకూలం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రెండుసార్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 20కి పైగా స్థానాల్లో గెలిపించి టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని తీర్పునిచ్చారు. ప్రధాన పతిపక్ష హోదానిచ్చారు. కానీ, హస్తం గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు క్యూ కట్టి టీఆర్ఎస్ గూటికి చేరింది. దీనిలో ఏపీ పెద్దమనిషితో పాటుగా రాష్ట్రానికి చెందిన నేతలే కారణమనే విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ప్రజాబలం ఉందంటూ తెలుస్తున్నా.. నాయకుల్లో నిబద్ధత లేకపోవడం, పార్టీలోని అంతర్గత విబేధాలు ప్రతిబంధకంగా నిలుస్తున్నాయి. మరోవైపు రేవంత్​వ్యవహారం ఎలా ఉన్నా.. రాష్ట్రంలోనూ సీనియర్లు ఆయన దూకుడుకు కళ్ళెం వేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ బలహీనతను కేసీఆర్ అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇంత కాలం ఇది రహస్య వ్యవహారంగా సాగుతున్నా ప్రస్తుతం కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు సీఎం కేసీఆర్‌కు మంచి మిత్రులుగా మెలుగుతున్నారనేది బహిరంగ రహస్యమే.

Advertisement

Next Story

Most Viewed