పంచాయతీ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలి: CPIM

by GSrikanth |
పంచాయతీ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలి: CPIM
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీల కాలపరిమితి 2024 జనవరి 31తో పూర్తవుతుందున తక్షణమే ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలక వర్గాలను రద్దు చేసి స్పెషల్‌ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించి, కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోందన్నారు. ప్రజలెన్నుకున్న పాలకవర్గాల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలనను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ వ్యతిరేకిస్తున్నదని తెలిపారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండుసార్లు పంచాయితీ ఎన్నికలు జరిపినప్పటికీ, ప్రజాతంత్ర యుతంగా నడపడంలో విఫలం చెందిందన్నారు. పంచాయితీల సంఖ్యను 12,741కి పెంచినప్పటికీ బడ్జెట్‌ మాత్రం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రు.14,369 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్న నమ్మకంతో సర్పంచ్‌లు సొంత డబ్బుతో పనులు చేశారన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు, అసలు చెల్లించలేక 28 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. 14, 15 ఫైనాన్స్‌ కమిషన్‌లు ఇచ్చిన నిధులు కూడా గ్రామ పంచాయితీలకు పంపిణీ చేయలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ నిధులను కూడా నేరుగా పంచాయితీలకు వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తుందని తెలిపారు.

Advertisement

Next Story