ఎన్నికల వరకే పొత్తులు.. ఆ తర్వాత మేము ప్రజల పక్షమే: చాడ వెంకట్ రెడ్డి

by Mahesh |   ( Updated:2023-11-09 15:23:59.0  )
ఎన్నికల వరకే పొత్తులు.. ఆ తర్వాత మేము ప్రజల పక్షమే: చాడ వెంకట్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పొత్తులు కేవలం ఎన్నికల వరకేనని తాము నిత్యం ప్రజలపక్షానే నిలబడతామని, భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తాము మాత్రం ప్రజల తరపునే పోరాడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు . గతంలో బీఆర్ఎస్ మద్దతు నిచ్చిన సమయంలో వరంగల్, రంగారెడ్డి, తదితర జిల్లాల్లో వేలాది మంది పేదలతో గుడిసెలు వేయించి పోరాటాలు చేశామని గుర్తు చేశారు.

రెవెన్యూ చట్టాల అంశంలో తన అభిప్రాయాలను తీసుకున్న సీఎం కేసీఆర్, తాను సూచించిన అంశాలనే అందులో పొందపర్చలేదని వివరించారు. ధరణిని బిఆర్ నేతలు అరచితిలో వైకుంఠంగా చూపిస్తున్నాదని అన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అయన దుయ్యబట్టారు .ఈ కారణంగా కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కాంగ్రెస్ అభ్యర్థులపైనే ఐటీ దాడులు జరుగుతున్నాయని, బిఆర్ ఉన్నప్పుడు జరగని ఐటి దాడులు కాంగ్రెస్ రాగానే జరుగుతున్నాయన్నారు. బిజెపి, బిఆర్ అభ్యర్థులపైన ఎందుకు ఐటి దాడులు జరగడం లేదని అయన ప్రశ్నించారు .రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల నాణ్యమైన కరెంటు అమలు కావడం లేదని విమర్శించారు. ధనిక రాష్ట్రాంలో పేదల ఆదాయం ఎందుకు పెరగడం లేదని, వారు ఇంకా ప్రభుత్వంపైన ఎందుకు ఆధారపడాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయని బిఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన మోడీ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని, ప్రాథమిక హక్కులను పాతర వేశారని, ప్రశ్నించే గొంతులను నొక్కెస్తున్నారని దుయ్యబట్టారు.

మోడీ పాలనలో రాజ్యాంగం నిరాదరణకు గురవుతోందన్నారు. ఆర్ ఎస్ ఎస్ ఏజెండానే మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అన్ని వ్యవస్థలపైన దాడి జరుగుతోందన్నారు. రైతులకు వ్యతిరేకంగా , కార్పొరేట్ శ క్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన చట్టాలను నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారని, ఇందులో 750 మంది రైతులు చనిపోయారని గుర్తు చేశారు. అపర భగీరథుడు, ప్రపంచ రికార్డ్ చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు కుంగిపోయిన రికార్డ్ సాధించిందని ఎద్దేవా చేశారు.

అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని స్పష్టం చేశారు. ప్రగతిశీల శక్తులతో కలిసి పని చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల ముందు తమతో చెప్పారని చాడ వెంకట్ రెడ్డి వివరించారు. ప్రజా సమస్యలపై తమకు వినతులు ఇస్తే వాటిని పరిష్కరిస్తామని కూడా చెప్పారని, కానీ కనీసం కలవలేదని, కేసీఆర్ మాటలు నీటి ముటలుగా మారాయని, ఆయన మాట తప్పారని అన్నారు. సీట్ల విషయంలో లో కాంగ్రెస్, సిపిఐ(ఎం) పార్టీల మధ్య అవగాహన కుదరలేదని, కాబట్టి వామపక్షాలుగా కలిసి పోటీ చేయలేకపోతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. తమకు కూడా కాంగ్రెస్ అవగాహనలో ఒక్క సీటు కేటాయించడం పట్ల సంతృప్తి లేకున్నా, అప్రజాస్వామిక, నియంతృత్వ బి ఆర్ ఎస్ ను ఓడించేందుకు, అనివార్య, తప్పని పరిస్థితుల్లోనే తాము కాంగ్రెస్ ఎన్నికల అవగాహనతో వెళ్తున్నామని చాడ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు అనివార్యంగా మారాయని ఆయన తెలిపారు .

Advertisement

Next Story

Most Viewed