కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు అహంభావం పెరిగింది: సీపీఐ నారాయణ

by GSrikanth |   ( Updated:2023-11-13 09:42:21.0  )
కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు అహంభావం పెరిగింది: సీపీఐ నారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, సీపీఐకి అనుకూల పవనాలు వీస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడిన కోదండరామ్, సీపీఐ నేతలను పక్కన పెట్టి తెలంగాణ వ్యతిరేకులైన ఎర్రబెల్లి వంటి వారిని మంత్రులను చేసి పక్కన కూర్చోబెట్టుకున్నారని ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్ లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు మిత్రపక్షాలని ఒక్క ఓటుతో మూడు పార్టీలను దెబ్బకొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కు ఓటు వేయడమంటే బీజేపీకి ఓటు వేయడమే అని అన్నారు.

ఇన్నాళ్లు ఏదైనా ప్రాజెక్టు గేట్లు ఊడిపోవడమో, కొట్టుకుపోవడమో విన్నాం కానీ నిర్మాణమం చేపట్టిన తక్కువ సమయంలో పునాదులతో సహా కదిలిపోయిన ప్రాజెక్టు ఒక్క కాళేశ్వరమే అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పునాదులు కదిలిపోతుంటే బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ లు డబ్బులతో నిండిపోతున్నాయని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి షేర్ లేకుండా రాష్ట్రంలో ఏ కొత్త ప్రాజెక్టు, మెడికల్ కాలేజీ, రియల్ ఎస్టేట్ వెంచర్, షాపింగ్ మాల్ కు అనుమతి రావడం లేదన్నారు. అవినీతికి మించి కల్వకుంట్ల కుటుంబసభ్యులకు అహంభావం కూడా పెరిగిపోయిందని ఈ అహంభావమే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించబోతున్నదన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలి:

నాంపల్లి అగ్నిప్రమాద స్థలాన్ని నారాయణ పరిశీలించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed