సీపీఐ మావోయిస్టు కొరియర్ల అరెస్ట్..

by Kalyani |
సీపీఐ మావోయిస్టు కొరియర్ల అరెస్ట్..
X

దిశ, ములుగు ప్రతినిధి: మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా పనిచేస్తున్న 8 మందిని ములుగు జిల్లా పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం మీడియా సమావేశంలో తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం సుమారు 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు వెంకటాపురం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామ శివారులో అనుమానంతో కారు, బైక్‌పై ప్రయాణిస్తున్న అందె రవి , శ్రీరామోజు మనోజు, దిడ్డి సత్యం, శ్రీరామోజు భిక్షపతి, అనసూరి రాంబాబు, ఘనపురం చంద్రమౌలి, ఘనపురం పృథ్వీ రాజ్, మానసలను అదుపులోకి తీసుకున్నారు.

తగిన జాగ్రత్తలు పాటిస్తూ వారి వాహనాలను తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు, ఐఈడీ మెటీరియల్‌లోని లోహ భాగాలు, సీపీఐ(మావోయిస్ట్) పార్టీ విప్లవ సాహిత్యంతో పాటు కొన్ని మందులను పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితులను విచారించగా.. కొంత కాలం క్రితం తమ భూ సమస్యలు పరిష్కారం కోసం మావోయిస్టు గ్రూపు ప్రధాన నాయకుడు దామోదర్ తో పాటు మరి కొంతమంది దళ సభ్యులను కలిశామని, ఈ క్రమంలోనే సీపీఐ మావోయిస్టు గ్రూపు విప్లవ భావజాలానికి ఆకర్షితులైనట్లు విచారణలో తేలింది. అందులో భాగంగానే మావోయిస్టు పార్టీ నేతలు చంద్రన్న, దామోదర్‌ ల కోసం వీరంతా క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే దామోదర్ సూచనల మేరకు నిందితులు కొన్ని పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, మందులను సేకరించి వారికి ఇచ్చేందుకు బయలుదేరారు.

ఇది ఇలా ఉండగా కూంబింగ్ ఆపరేషన్ల కోసం అడవికి వచ్చిన పోలీసులను చంపాలనే ఉద్దేశంతో దామోదర్‌ ఈ ప్రణాళిక చేసినట్లు తెలిసింది. వీరి వద్ద నుంచి IEDs-45 సంబంధించిన ఇనుప భాగాలు, కార్డెక్స్ వైర్-10మీటర్లు, డిటోనేటర్లు-02, బ్యాటరీ-01, విప్లవ సాహిత్యం-04, సీపీఐ (మావోయిస్టు) పార్టీ యొక్క అనారోగ్య UGక్యాడర్‌లకు ఉద్దేశించిన మధుమేహం, అనారోగ్యాలు నయమయ్యేందుకు మందులు, కారు బేరింగ్ నెం: TS11 EY0306 (వైట్ కలర్ కియా సెల్టోస్)-01, హోండా మోటార్ బైక్ బేరింగ్ నెం: TS25A1007 (నలుపు రంగు)-01,మొబైల్ ఫోన్లు-08,నగదు రూ: 4140/- స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి ఆధారంగా, ములుగు జిల్లా పీఎస్ వెంకటాపురంలో Cr . నం: 39/2023, U/Sec.120(b), 143, 307 IPC r/w 149, TSPS చట్టంలోని సెక్షన్ 8(1)(2), ESచట్టంలోని సెక్షన్ 5, UAPA యొక్క 10,13, 18 చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story