సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై సీపీఐ కూనంనేని హర్షం

by GSrikanth |   ( Updated:2023-06-17 14:13:27.0  )
సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై సీపీఐ కూనంనేని హర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపా చట్టాన్ని దేశవ్యాప్తంగా ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. చట్టాన్ని ఎత్తివేయడానికి ప్రజాతంత్ర వాదులు, ప్రజాస్వామ్యాన్ని కోరే వారు, ప్రజాతంత్ర పాలనను అందించాలనుకునే పాలకులు ఈ ఉపా చట్టాన్ని ఎత్తివేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. దేశ ద్రోహం కేసు చట్టాన్ని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌, పద్మజా షాతోసహా మరో 152 మంది పెట్టిన ఊపా కేసును ఎత్తివేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తంచేశారు. నేషనల్‌ ఇన్విస్టిగేషన్‌ ఎజెన్సీ (ఎన్‌ఐఏ) కూడా వేధింపులకు నిరుపయోగంగా ఉన్న చట్టాలను ఉపయోగిస్తున్నారని అన్నారు.

ఈ సెక్షన్లు చట్టపరంగా ఎలాంటి ప్రయోజనం లేకపోగా, ప్రజాసమస్యలపై ప్రశ్నించే గొంతుకలను నొక్కివేయడానికి, వారిని భయభ్రాంతానికి గురిచేయడానికి పోలీసు యంత్రాంగం ఉపయోగిస్తున్నారని, కొన్ని కేసులు ప్రభుత్వానికి కూడా తెలియకుండా పెడుతున్నారన్నారు. తనపై కూడా తాడా కేసులు పెట్టారని గుర్తుచేశారు. 1987లో తాను మండల అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సాధారణంగా ఒక పార్టీకి మరోపార్టీకి జరిగే ఘర్షణలో నేడు ఊపాగా పిలువబడే తాడా కేసు పెట్టారని, అనాడు ఎన్‌టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చలు జరిపి తాడా సెక్షన్‌ను ఎత్తివేసిన తర్వాతే బెయిల్‌ రావడం జరిగిందన్నారు. నాలాంటి వారిపై కూడా టెర్రరిస్టుల కేసులు పెట్టడం వలన ఈ చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో అర్ధం అవుతుందన్నారు.

కేసు వాపస్‌పై నారాయణ హర్షం

ప్రముఖ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు 152 మందిపై ములుగు పోలీస్ స్టేషన్లో ఉపా కేసు నమోదు చేయడానికి సీపీఐతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వ్యతిరేకించడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపా కేసును వెనక్కి తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొని మద్దతు తెలిపారని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు దేశానికి తెలిసే విధంగా ఆయన ప్రసంగాలు చేశారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read..

బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోండి: కాంగ్రెస్

Advertisement

Next Story