'ప్రేమ'ను గెలిపించలేకపోతున్న జంటలు.. చివరకు విషాదాలుగానే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-21 08:31:52.0  )
ప్రేమను గెలిపించలేకపోతున్న జంటలు.. చివరకు విషాదాలుగానే..!
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు హృదయాలను కలిపేది ప్రేమ.. ఆ బంధం అజరామరం.. ఏన్నో ప్రేమ కథలు సక్సెస్ స్టోరీలుగా మిగిలితే మరెన్నో విషాదాలుగా మిగులుతున్నాయి. యువత క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయా కుటుంబాల్లో కన్నీళ్లను మిగులుస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లికి పెద్దలు నిరాకరించారని యువ ప్రేమ జంటలు తనువు చాలిస్తున్నాయి.

మరో ఘటనలో పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నా సెటిల్ కాలేదనే కారణంగా మరో జంట సూసైడ్ చేసుకుంది. ప్రేమించడంలో ఉన్న స్పష్టత జీవితంపై.. పెద్దలను ఒప్పించడంపై లేక పోవడంతో అనేక జంటలు విగతజీవులుగా మారుతున్నారు. తనువు చాలించేందుకు ఉన్న దైర్యం, తెగువ ప్రేమను గెలిపించుకోవడంలో చూపకపోవడంతో జీవిత పోరాటంలో ఓడిపోతున్నారు.

తమ కన్నవారి కలలు, ఆశలు, ఆశయాలు తీరక ముందే వారికి శోకాన్ని మిగులుస్తున్నారు. తమ వారు చేతికందారని సంబరపడే లోపే జరుగుతున్న దారుణాలతో తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. రైలుపట్టాలపై మెడలు తెగి, చెరువుల్లో దూకి విగతజీవులుగా మారి, ఉరి తాళ్లకు వేలాడుతూ.. కనిపిస్తున్న తమ వారి మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు.

తాజాగా మంచిర్యాలలో ఓ జంట..

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (25), సంఘవి (21) ల మనసులు కలిసాయి. పెద్దలు సైతం వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. కానీ ఆటో డ్రైవర్ అయిన శ్రీకాంత్ తానింకా సెటిల్ కాలేదని, అందులోనూ బోలెడ్ అప్పులు ఉన్నాయని మధన పడ్డాడు. ఇదే విషయమై మాట్లాడుకుందామని సంఘవిని ఎల్లంపల్లి జలాశయం వైపునకు ఆటోలో తీసుకెళ్లాడు.

పెళ్లి చేసుకుంటే పోషించడం ఎలా.. తనకు అప్పులు కూడా ఉన్నాయని చెబుతూ తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. దీంతో షాక్ కు గురైన సంఘవి చస్తే ఇద్దరం చద్దామంటూ తాను కూడా పురుగుల మందు తాగింది. ఇబ్బందిగా ఉండటంతో వీరిద్దరు ఆటోలో ఆస్పత్రికి వెళ్లారు. కానీ పరిస్థితి విషమించడంతో తనువు చాలించారు. ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపినా కూడా ఇలా జరగడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

సవాళ్లను అధిగమించడమే జీవితం అనే పాఠంపై సరిగా అవగాహన లేక వీరిద్దరు తమ ప్రాణాలు కోల్పోయారు. బతికి ఉండి పెళ్లి చేసుకుని తామనుకున్న లక్ష్యాలను సాధిస్తే ఎంతో మంది ప్రేమికులకు వీరు ఆదర్శంగా నిలిచేవారే..

మతాలు వేరు కావడంతో..

మెదక్ జిల్లా నార్సింగి గ్రామానికి చెందిన కల్పన, ఖలీల్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి మతాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించారు. రెండు నెలల క్రితం కల్పనకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. దీన్ని తట్టుకోలేక కల్పన, ఖలీల్ ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటనపై ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీరి కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో నార్సింగి చెరువులో వీరి మృతదేహాలు తేలాయి. పారిపోయిన రోజే వీరు చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో సైతం పెద్దలను ఎదురించలేక, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక పోవడంతో కల్పన, తాను ప్రేమించిన యువతితో జీవితాంతం బ్రతకడం సాధ్యం కాకపోవడంతో ఖలీల్ చెరువులో దూకి తనువు చాలించారు.

ఇటీవల నారాయణ పేట జిల్లా కృష్ణ చేగుంట రైల్వే స్టేషన్ వద్ద ఓ ప్రేమ జంట సైతం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో మణి కుమార్, అనిత తల, మొండెం వేరు కావడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఇలా వరుసగా ప్రేమ కథలు విషాదాలుగా మిగులుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తమ ప్రేమను గెలిపించడంలో ఓడిపోయి నూరేళ్ల జీవితాన్ని యువజంటలు అర్థంతరంగా ముగిస్తున్నాయి.

Advertisement

Next Story