బేగంపేటలో దేశంలోనే మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్

by M.Rajitha |
బేగంపేటలో దేశంలోనే మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నూతన ఎయిర్ పోర్టుల నిర్మాణం, ప్రస్తుతం ఉన్నవాటి నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలపై బుధవారం రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు వికాస్ రాజ్, దాసరి హరిచందన.. స్టేట్ ఏవియేషన్ విభాగాల అధికారులతో భేటీ అయ్యారు. వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో ఎయిర్ పోర్టులు నిర్మించే అంశంలో సాధ్యాసాధ్యాలను అధికారులు చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందుకు అవసరమైన నివేదిక రూపకల్పనపైన అధికారులు సమగ్రంగా మంతనాలు జరిపారు. నివేదికలను రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర ఏవియేషన్ శాఖకు పంపించే ఛాన్స్ ఉందని సమచారం.

దాంతోపాటు, కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో భారతదేశంలో మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (సీఏఆర్ఓ) నిర్వహణపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. దీని ద్వారా దేశంలో సివిల్ ఏవియేషన్ రంగంలో పలు క్లిష్టమైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, వెనువెంటనే పరిష్కారాలను కనుగొనడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించనుంది. భారత్‌లో ప్రస్తుతం ప్రతి సంవత్సరం సుమారు 341 మిలియన్ల ప్రయాణికులు విమానాలను ఉపయోగిస్తున్నారని.. 2027 నాటికి ఈ సంఖ్య 520 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ విమానయాన సమస్యలను పరిష్కరించడంలో దోహదం చేయనుంది. ఎయిర్ ట్రాఫిక్ సజావుగా సాగడం, ప్రయాణీకుల భద్రత, కొత్త ఎయిర్ ట్రాఫిక్ మార్గాల రాకపోకలపై అధ్యయనం చేయడం వంటి కీలక పరిశోధనలు ఇక్కడ జరగుతాయి. ఇక రాష్ట్రానికి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు మంజూరు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు తెలంగాణ ఆర్&బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విన్నవించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా అధికారులు చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed