అక్కడ ఏ రిజిస్ట్రేషన్ కైనా కప్పం చెల్లించాల్సిందే..

by Sumithra |
అక్కడ ఏ రిజిస్ట్రేషన్ కైనా కప్పం చెల్లించాల్సిందే..
X

దిశ, వైరా : వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. ఈ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటును నిర్ణయించారు. ప్లాట్ రిజిస్ట్రేషన్, ఇంటి రిజిస్ట్రేషన్ మొదలుకొని మ్యారేజి రిజిస్ట్రేషన్ వరకు ప్రతి పనికి నగదు చెల్లించాల్సిన దుర్భర పరిస్థితి ఇక్కడ నెలకొంది. తాము నీతి నిజాయితీలతో పని చేస్తున్నామని చెప్పే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లకు నగదును వసూలు చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. డాక్యుమెంట్ రైటర్ లను మధ్యవర్తులుగా పెట్టుకుని ఇక్కడ పనిచేసే ఓ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ అధికారులు మామూళ్ల రూపంలో ఒక్కో ఇంటికి రూ. 7 వేలు వసూలు చేస్తున్నారు. ఈ నగదులో ఓ అధికారికి రూ.5000, మిగిలిన రూ.2000 కార్యాలయ సిబ్బందికి ఇస్తున్నట్లు డాక్యుమెంట్ రైటర్లు చెబుతున్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ కు రూ.1500 నుంచి రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు. ఈ నగదులో రూ. 500 కార్యాలయ సిబ్బందికి పోను మిగిలిన నగదు ఓ అధికారి తీసుకుంటున్నారు.

ఈ వ్యవహారం అంతా బహిరంగంగా జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. తాము లింకు డాక్యుమెంట్ లతో పాటు అన్ని సక్రమంగా ఉన్న ఇళ్లకు ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తున్నామని సబ్ రిజిస్ట్రార్ చెబుతున్నారు. అలా సక్రమంగా ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ చేసేందుకు నగదు ఎందుకు వసూలు చేస్తున్నారని ఇటీవల కొంతమంది సబ్ రిజిస్ట్రార్ ను ప్రశ్నించారు. మ్యారేజి రిజిస్ట్రేషన్ కూడా రూ. 1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతిపనికి అందిన కాడికి దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇదంతా తమకు మామూలే అన్నట్లు జిల్లా ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు.

డాక్యుమెంట్ రైటర్లే వసూలు చేసుకుంటున్నారేమో.. బి.రామచంద్రయ్య, వైరా సబ్ రిజిస్ట్రార్

రిజిస్ట్రేషన్ ల కోసం తమ కార్యాలయంలో రూపాయి కూడా లంచం వసూలు చేయటం లేదని వైరా సబ్ రిజిస్ట్రార్ బి.రామచంద్రయ్య తెలిపారు. తమ కార్యాలయం పేరుతో డాక్యుమెంట్ రైటర్లే నగదు వసూలు చేస్తున్నారనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. తాను నిజాయితీగా, నిబద్ధతగా రూపాయి తీసుకోకుండా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లు వసూలు చేసే నగదుకు తనకు సంబంధమేమిటని ఎదురు ప్రశ్నించారు. ఇటీవల ఓ డాక్యుమెంట్ రైటర్ కార్యాలయంలో నాలుగు రోజులు రాత్రులు సబ్ రిజిస్టర్ నిద్రించిన విషయమై ప్రశ్నించగా తనకు వైరాలో లాడ్జిలు ఎక్కడ ఉన్నాయో తెలియక అక్కడ పడుకున్నానని, ఈ విషయం బహిర్గతమైతే చీప్ గా ఉంటుందని పేర్కొనడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed