మళ్లీ కరోనా కలకలం.. అలర్ట్‌గా ఉండాలని ప్రభుత్వం ఆదేశం

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-22 04:16:38.0  )
మళ్లీ కరోనా కలకలం.. అలర్ట్‌గా ఉండాలని ప్రభుత్వం ఆదేశం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : నగరంలో కరోనా మళ్లీ కలకలం రేపుతున్నది. నగరంలో 2020లో ఫస్ట్ కేసు నమోదైంది. ఆ తర్వాత కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవడంతో లాక్‌డౌన్, ఆంక్షలతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత కాలంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 6 కోవిడ్ కేసులు నమోదు కాగా, గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోనే 4 కేసులు వెలుగుచూశాయి.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇందులో 16 కేసులు హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. కేరళలో కొత్త వేరియంట్ జే‌1 వైరస్ వేగంగా విస్తరించడం మూలంగా ముగ్గురు చనిపోయారు. అయితే ఇప్పుడు అయ్యప్ప మాల సీజన్ కావడంతో నగరం నుంచి వేల సంఖ్యలో మాలధారులు కేరళ రాష్ట్రంలో కొలువై ఉన్న శబరిమలకు ఇరుముడితో వెళ్లొస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో కూడా కరోనా ప్రమాద ఘంటికలు మోగించే ప్రమాదం ఏర్పడింది.

మరోవైపు వైరల్ ఫీవర్స్..

ప్రస్తుత చలికాలంలో వైరల్ ఫీవర్స్ కూడా ఆందోళన కల్గిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులతో నగరంలో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే కోవిడ్ లక్షణాలు, వైరల్ ఫీవర్స్ లక్షణాలు సుమారుగా ఒకే తీరుగా ఉండడంతో ప్రజలు తమకు వచ్చింది వైరల్ ఫీవరా? లేక కోవిడా? అని భయపడుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటితో ఫీవర్ ఆస్పత్రితో పాటు ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొంతమంది కోవిడ్ పరీక్షలు చేపించుకోకుండానే వైరల్ ఫీవర్ కోసం మందులు వాడుతున్నారు.

వీరు కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే మరిన్ని కేసులు వెలుగుచూసే అవకాశం లేకపోలేదు. వయస్సు పైబడిన వారు, శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు వంటి వాటితో ఇబ్బందులు పడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరి మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ప్రజలు భయాందోళనలకు గురికావద్దని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఉస్మానియా, గాంధీ తదితర ప్రభుత్వ ఆస్పత్రులలో కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక వార్డులు, ఆక్సీజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుతున్నారు.

ఏర్పాట్లకు ఆదేశాలు..

క్రైస్తవులు ఎంతో పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగకు మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దీని తర్వాత నూతన సంవత్సర వేడుకలు, అనంతరం సంక్రాంతి వంటి పండుగలు రానున్నాయి. వీటిని కూడా నగర ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీంతో మరిన్ని కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మాస్కులు తప్పనిసరి ధరించి సురక్షితంగా ఉండాలని సూచిస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ పరీక్షా కేంద్రాలు, మెడిసిన్, ఆక్సీజన్ సిలిండర్లు, పీపీఈ కిట్లు వంటి పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించడం పరిస్థితికి అద్దం పడుతోంది.

హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా, డీహెచ్ రవీంద్రనాయక్, డీఎంఈ త్రివేణి, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ.నాగేందర్, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో సహా పలువురు ఉన్నతాధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ పూర్తి చేయాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే కొవిడ్ టెస్టులు చేయాలని, పాజిటివ్ వచ్చిన నమూనాలను ఉప్పల్‌లోని సీడీసీకి పంపాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.31 శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed