journalist Mukesh: జర్నలిస్టు ముఖేశ్ హత్య కేసులో కాంట్రాక్టర్ హైదరాబాద్ లో అరెస్టు

by Prasad Jukanti |   ( Updated:2025-01-04 10:11:18.0  )
journalist Mukesh: జర్నలిస్టు ముఖేశ్ హత్య కేసులో కాంట్రాక్టర్ హైదరాబాద్ లో అరెస్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన జర్నలిస్ట్ ముఖేశ్ చంద్రకార్ (Journalist Mukesh) హత్య కేసులో పోలీసులు కాంట్రాక్టర్‌తో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ సురేశ్‌ (Contractor Suresh) ను బీజాపూర్ పోలీసులు ఇవాళ హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్.పి (IG P. Sundar Raj) తెలిపారు. కాగా, గతంలో ముఖేశ్ చంద్రకర్ పలు పత్రికలు, చానళ్లలో జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ‘బస్తర్ జంక్షన్’ పేరుతో యూట్యూబ్ చానల్ నడిపిస్తున్నారు. ఈ నెల 1న ముఖేశ్ అదృశ్యం కాగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా విచారిస్తుండగా బీజాపూర్‌లోని చట్టాన్ పారా ప్రాంతంలోని ఓ ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో ముఖేశ్ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. సురేశ్ చేపడుతున్న రోడ్డు పనులకు సంబంధించిన అవినీతిని ముఖేశ్ బయటపెడ్డాడనే అక్కసుతోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్‌లో కాంట్రాక్టర్ సురేశ్‌ను అరెస్టు చేశారు.

Advertisement

Next Story