కోదండరామ్‌ను చట్టసభల్లోకి రానీయకుండా కుట్ర!.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

by Ramesh N |
కోదండరామ్‌ను చట్టసభల్లోకి రానీయకుండా కుట్ర!.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి ప్రమాణస్వీకారం సమయంలో అడుగడుగున ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. సోమవారం ప్రమాణ స్వీకారానికి కౌన్సిల్ హాల్‌కు వాళ్లిద్దరు వెళ్లినప్పుడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారం పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా మరోసారి ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది.

ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది.

బీఆర్ఎస్ అంతు తేలుస్తామంటూ వార్నింగ్

ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారంపై తెలంగాణ జన సమితి పార్టీ ఫైర్ అయ్యింది. తెలంగాణ ఉద్యమనేతపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుతంత్రమని, కోదండరామ్‌పై కేసీఆర్ కుట్ర మరోసారి బహిరంగమైనదని పార్టీ విమర్శించింది. ముందస్తు ప్రణాళికతోనే కోదండరామ్ ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేయించి కోర్టులో కేసు వేశారని పార్టీ ఆరోపించింది. ఉద్యమ నాయకుడు చట్టసభల్లోకి వస్తుండు అంటేనే కేసీఆర్ వణికి పోతున్నారని విమర్శించింది. గత ప్రభుత్వ అవినీతిని చట్టసభల్లో నిలదీస్తారనే భయంతోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రొ. కోదండరామ్‌ను ఓడించారని, ఇప్పుడేమో కోర్టును తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. కుట్రలకు మేం భయపడమని, ప్రజాక్షేత్రంలో బీఆర్ఏస్ అంతుతేలుస్తామని టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ నీచ రాజకీయాలను నిరసిస్తూ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story