- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘పెండింగ్’ వెనక పెద్దల కుట్ర.. ఆ ఐదు జిల్లాల్లో ‘ధరణి’కి సెపరేట్ రూల్స్!
భూమి ఎంత ఖరీదైనా... ఎన్ని వివాదాలుంటే అంత ధర తగ్గుతుంది. ఇదే ట్రిక్ ను కొందరు పెద్దలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు. భూముల వివాదాలు పరిష్కారానికి నోచుకోకుండా పావులు కదుపుతున్నారు. ఇందుకు అధికార యంత్రాంగం సహకారం తోడవుతున్నది. అందుకే ఐదు జిల్లాల్లో ధరణి పోర్టల్ కి అనధికారికంగా సెపరేట్ రూల్స్ అమలవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ‘టీం 33’ మాడ్యుల్ కింద ఎన్ని దరఖాస్తులు వచ్చినా ఆఫీసర్లు పరిశీలించడం లేదనే ఆరోపణలున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో:
మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ధరణి అప్లికేషన్లు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రధానంగా టీఎం 33 మాడ్యూల్ కింద వచ్చిన దరఖాస్తులను అధికారులు కనీసం పరిశీలించడం లేదు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల కారణంగానే జిల్లా ఆఫీసర్లు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఖరీదైన భూములపై ఎన్ని వివాదాలు కొనసాగితే అంత తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి అనువుగా ఉంటుంది. అందుకే ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నతాధికారుల ద్వారా కలెక్టర్లు, తహశీల్దార్లకు మౌఖికంగా సూచించారన్న చర్చ నడుస్తున్నది. అరకొర దరఖాస్తులకు మోక్షం లభించినా, అవి పెద్ద కంపెనీలు, బడా వ్యక్తులవేననే ప్రచారం జరుగుతున్నది.
పీఓబీలో ఉంచేలా కుయుక్తులు
రాజకీయ నాయకుల భాగస్వామ్యం కలిగిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు వందలాది ఎకరాలు కొనుగోలు చేశాయి. వీళ్ల కొనుగోళ్లు అప్రతిహాతంగా సాగాలంటే ధరణి పోర్టల్ లో వివాదాల సుడిగుండంలో భూములు కొట్టుమిట్టాడాలి. అప్పుడే వాళ్లకు తక్కువ ధరకు భూములు లభించే అవకాశం ఏర్పడుతుంది. వాళ్లకు నచ్చిన రేట్లకు ఇవ్వకపోతే భూ సమస్యలన్నీ పెండింగులో ఉంచేందుకు అనేక రకాల కుట్రలు సాగిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక కేసు వేసి పీవోబీలో ఉంచేటట్లు కుయుక్తులు అమలు చేస్తున్నారు. ఎకరం విలువ రూ.కోట్లకు చేరడంతో తమ భూములు కాపాడుకునే పరిస్థితుల్లో సామాన్యులు కనిపించడం లేదు. ఎప్పుడు ఏ పిటిషన్, ఏ కేసు దాఖలు విషయాన్ని వినాల్సి వస్తుందోనని హైదరాబాద్ నగర శివారు జిల్లాల రైతాంగం ఆందోళన చెందుతున్నది.
అన్నీ నిలిపివేత
ధరణి పోర్టల్ లోని టీఎం 33 మాడ్యూల్ కింద 2.50 లక్షలకు పైగానే అప్లికేషన్స్ వచ్చినట్లు సమాచారం. జిల్లా స్థాయిలో కలెక్టర్లు పరిశీలించి సీసీఎల్ఏ కార్యాలానికి సంబంధిత ఫైల్స్ అన్ని పంపిస్తున్నారు. అయితే రెండు నెలలుగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో అప్లికేషన్ల పరిశీలన నిలిపివేసినట్లు తెలుస్తున్నది. సీసీఎల్ఏ కార్యాలయంలో వీటికి సంబంధించిన ఏ ఫైల్ ఓపెన్ చేయడం లేదు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రతి రోజూ హైదరాబాద్ నాంపల్లిలోని సీసీఎల్ఏ కార్యాలయానికి వందలాది మంది బాధితులు డాక్యుమెంట్లు, ఇతర పత్రాలు పట్టుకొని వస్తున్నారు.
ఈ ఐదు జిల్లాల అప్లికేషన్లు ఎందుకు పరిశీలించట్లేదన్న అంశంపై సీసీఎల్ఏ అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పడం లేదని ధరణి పోర్టల్ సమస్యల వేదిక ఆరోపిస్తున్నది. రైతుల పాస్ బుక్ డేటా కరెక్షన్, టీఎం 33 ఫైల్స్ ఎప్పుడు క్లియర్ చేస్తారో సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. కొత్త మాడ్యూల్ ఎప్పుడిస్తారని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సమస్యలతో అర్జీదారులు పెద్దఎత్తున ఆఫీసుకు వస్తుండడంతో సీసీఎల్‌ఏ అధికారులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొందరు అధికారులు రైతులు, సాధారణ ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇది మారాలని ధరణి సమస్యల పరిష్కార వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి అన్నారు.
ఆర్ఆర్ఆర్ వరకు కంపెనీలే
గతంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వరకు మాత్రమే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉండేవి. ఇప్పుడవి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు వరకు వచ్చేశాయి. అక్కడి దాకా కొన్ని కంపెనీలు వందలాది ఎకరాలు కొనుగోలు చేశాయి. రాజకీయ నాయకుల భాగస్వామ్యంతో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేస్తున్నాయి.
అయితే ఈ కంపెనీలన్నింటికీ వివాదాస్పద భూములపైనే ఆసక్తి కనబడుతున్నది. నిన్నమొన్నటి వరకు వివాదాల్లో ఉన్నాయంటూ ప్రచారంలోని భూములను బడా కంపెనీలు కొనుగోలు చేస్తుండడం గమనార్హం. సామాన్యుల చేతుల్లో ఉన్నంత కాలం ఆ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. కానీ వాళ్లు కొనుగోలు చేయగానే అన్నీ క్లియర్ అవుతున్నాయి. అందుకే ఖరీదైన భూ సమస్యలన్నీ వారి కోసం పెండింగులోనే ఉంటున్నాయన్న చర్చ నడుస్తున్నది.
ఆఫీసర్లు తలుచుకుంటే సొల్యూషన్
ఆఫీసర్లు తలుచుకుంటే కొన్నింటికి అప్పటికప్పుడే పరిష్కారం లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతంలో ఓ పదెకరాల ప్రభుత్వ భూమి క్లాసిఫికేషన్ మార్చడంలో ఎలాంటి జాప్యం జరగలేదు. పెద్దల పని కావడంతో ఫైళ్లు చకచకా కదిలాయి. అలాగే కొన్ని మండలాల్లో ప్రభుత్వ భూములకు కూడా క్రయ విక్రయాలకు తహశీల్దార్లు సై అంటున్నారు. తాజాగా నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం మగనూర్ గ్రామం సర్వే నం.16, 35 లోని ప్రభుత్వ భూముల్లో రిజిస్ట్రేషన్లు చోటు చేసుకున్నాయి.
ఇది గుర్తించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష సదరు తహశీల్దార్ సీహెచ్ తిరుపతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. వాళ్లకు నచ్చితే ఫైళ్లు పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఓ సామాన్యుడు అన్ని సక్రమంగా ఉన్నా విరాసత్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ ఫైల్ మాత్రం నెలల తరబడి రావడం లేదు. అదేమని మండల స్థాయి అధికారులను అడిగితే కలెక్టరేట్ కి పంపాం.. అక్కడి నుంచి రాలేదంటూ తప్పించుకుంటున్నారు. నిజానికి మండల స్థాయిలో రిపోర్ట్ పంపిన ఏ ఫైలు కలెక్టర్ ఆపడానికి లేదు.. కానీ కలెక్టర్ నిలిపేశారని సమాధానం చెబుతూ ఈజీగా తప్పించుకునే మార్గాన్ని అమలు చేస్తున్నారు.