Conress: షాద్‌నగర్‌లో రేవంత్, మధిరలో భట్టి.. రాష్ట్రవ్యాప్తంగా 28 స్కూళ్లకు శంకుస్థాపన

by Ramesh Goud |
Conress: షాద్‌నగర్‌లో రేవంత్, మధిరలో భట్టి..  రాష్ట్రవ్యాప్తంగా 28 స్కూళ్లకు శంకుస్థాపన
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రేపు 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. గురువారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులకు శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్యను అందించాలన్న సీఎం ఆదేశాల మేరకు రేపు వివిధ జిల్లాల్లోని 28 ప్రాంతాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్టు సీఎస్ తెలిపారు.

మొదటగా రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారని తెలియచేసారు. అలాగే రేపు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధిత జిల్లాల మంత్రులు, ఇంచార్జ్ మంత్రుల ఆమోదం పొందిన అనంతరం, ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సవ వాతావరణంలో, ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులందరినీ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న ఈ 28 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రెండవ దశలో ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని సీఎస్ తెలిపారు.

ఈ సందర్భంగా శంకుస్థాపన జరిగే 28 నియోజకవర్గాలను వెల్లడించారు. కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్ చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పర్కాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట, జడ్చర్ల లో శంఖుస్థాపనలు జరుగుతాయని శాంతికుమారి వెల్లడించారు. కాగా తెలంగాణలోని పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందించేందుకు ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Next Story