కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు అరెస్ట్

by Kalyani |
కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు అరెస్ట్
X

దిశ, శేరిలింగంపల్లి: కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలును సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.మంగళవారం సాయంత్రం ఇనార్బిట్ మాల్ సమీపంలోని కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. అందులో పని చేస్తున్న సిబ్బందిని బయటికి పంపి ఆఫీసుని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. సునీల్ కనుగోలు కార్యాలయంలో కంప్యూటర్, లాప్ టాప్ లు సీజ్ చేశారు. సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపణలపై సునీల్ కనుగోలును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సునీల్ కనుగోలు కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024 గ్రూపులో ఉన్నారు. ఫేస్ బుక్ లో రెండు పేజీలు నిర్వహిస్తున్న ఆయన టీం ఆపన్నహస్తం పేరిట ఉన్న పేజీలో సీఎం కేసీఆర్ కు వ్యతిరేక వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలోని ఎస్ కే ఆఫీసులో ముందుగా సోదాలు నిర్వహించి ఆ తర్వాత సీజ్ చేశారు. అంతకుముందు పోలీసులు ఎస్ కే కార్యాలయంలోని సిబ్బంది సెల్ ఫోన్ లు ఆఫ్ చేయించడంతో పాటు ఆయన కార్యాలయాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు సునీల్ కనుగోలు అనుచరులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆఫీసును ఎలా సీజ్ చేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అటు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. సునీల్ కనుగోలు ఇది వరకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వద్ద పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగాను పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్నారు. సునీల్ కనుగోలు అరెస్ట్ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఇనార్బిట్ మాల్ వద్ద గల సునీల్ కనుగోలు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆయన అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. సునీల్ కనుగోలు అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న మాజీమంత్రి షబ్బీర్ అలీ ఇతర నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, ఎవరు కేసు పెట్టారో తెలియకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను భయాందోళనకు గురి చేస్తున్నారని, పోలీసుల వైఖరి సరికాదని, రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ అన్యాయంగా అరెస్ట్ లు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story