కాంగ్రెస్ అంటే 420 పార్టీ.. : మంత్రి కేటీఆర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-30 06:03:37.0  )
కాంగ్రెస్ అంటే 420 పార్టీ.. : మంత్రి కేటీఆర్
X

దిశ, ఖమ్మం : గ్రామాల్లో 5 రకాల విప్లవాల ద్వారా సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సందర్భంగా వైరా నియోజకవర్గంలోని గుబగుర్తిలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ గోదావరి, కృష్ణ జలాలను ఓడిసిపట్టి రైతులకు అందించాలనే సంకల్పంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గ్రామంలో పంచ విప్లవాలు సాధ్యమయ్యయన్నారు. హరిత విప్లవం ద్వారా ఎన్నడూ చూడని విధంగా వరి ధాన్యం పండించి పంజాబ్, హర్యానాను తలదన్నేలా తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు.

నీలి విప్లవం ద్వారా చెరువులో కాలువలు నిండుకుండల్లా మారి మత్స్యకారులకు చేపల పెంపకం జరిగిందన్నారు. గులాబీ విప్లవం ద్వారా పశువు సంపద ప్రోత్సాహంతో మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌గా ఉందన్నారు. శ్వేత(క్షీర) విప్లవం ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహంతో నష్టాల్లో ఉన్న పాల డైరీలు లాభాల బాటలో నిలిచాయన్నారు. పసుపు విప్లవం ద్వారా పామాయిల్ వంటి నూనె ఉత్పత్తిలో తెలంగాణ రాబోయే రోజుల్లో ముందుంటుందని తెలిపారు. పామాయిల్ పెంపకం ద్వారా ఎకరాకు రూ.1.20 నుంచి 1.50 లక్షల ఆదాయాన్ని రాబట్టుకోవచ్చు అన్నారు. పామాయిల్ పంట వేసిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలలో అంతర్ పంటల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అన్నారు. నాలుగోవ సంవత్సరం నుండి పామాయిల్ గెల్లలు రావడం మొదలవుతుందన్నారు.

పామాయిల్ తోటలతో కోతుల బెడద, పురుగుల బెడద ఉండదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కొంతమంది అవకాశవాదులు వస్తున్నారని వారి మాటలను నమ్మొద్దు అన్నారు. ఖమ్మం వైరా నియోజకవర్గాల్లో డబ్బులు ఇచ్చి ఓటర్లను కొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే 420 పార్టీ అని, ఆ పార్టీకే గ్యారెంటీ లేదని... ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు వందల పింఛన్ నుంచి రూ. 2000 ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. పార్టీల్లో అవకాశం రాకపోతే పార్టీలు మార్చే నాయకులు మనకు వద్దని, నియోజకవర్గంలో టికెట్ రాకపోయినా రాములన్న మనకి గ్యారెంటీగా నిలిచారని ఇలాంటి వారిని నమ్మాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed