- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలిటిక్స్‌కు సోనియా గాంధీ గుడ్ బై.. కాంగ్రెస్ లీడర్ల రియాక్షన్ ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో: మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమై రోడ్ మ్యాప్ రూపొందించుకునే కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ చేసిన ప్రసంగం సరికొత్త చర్చకు దారితీసింది. “భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండడం సంతోషం కలిస్తున్నది. ఇది దేశాన్ని మలుపు తిప్పిన యాత్ర. డాక్టర్ మన్‌మోహన్ సింగ్ నేతృత్వంలో 2004, 2009 ఎన్నికల్లో సాధించిన విజయాలు నాకు సంతృప్తినిచ్చాయి. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారు. పార్టీకి, ప్రజలకు ఇది సవాలు వంటి సమయం” అంటూ సోనియాగాంధీ చత్తీస్‌గఢ్‌లోని నవ రాయపూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో శనివారం చేసిన కామెంట్లు పార్టీలో, దేశ రాజకీయాల్లో దుమారం లేపాయి.
దాదాపు పాతికేళ్ళ పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించిన అంశాలను ప్రస్తావిస్తున్న సందర్భంలో పై కామెంట్ చేశారు. గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనందున ప్రెసిడెంట్ పాలిటిక్స్ నుంచి తప్పుకోనున్న అంశాన్ని ప్రస్తావించారా? లేక ఏకంగా యాక్టీవ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలనే మనసులోని మాటను బైటపెట్టారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోవచ్చని, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలి నుంచి ఆమె కూతురు ప్రియాంక పోటీ చేసే అవకాశాలున్నాయంటూ గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో సోనియాగాంధీ ప్లీనరే వేదికగా చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.
క్లారిటీ లేకపోవడంతోనే సందేహాలు..
సోనియాగాంధీ తన స్పీచ్‌లో ‘ఇన్నింగ్స్ ముగిశాయి’ అని వ్యాఖ్యానించడంతో దేనిని ఉద్దేశించి చేశారనేది పార్టీ కేడర్‌కు, లీడర్లకు మింగుడుపడడంలేదు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నందున ఇక నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారేమో అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ పార్టీ సీనియర్ నేతలు మాత్రం కేవలం పార్టీ అధ్యక్ష బాధ్యతల గురించి మాట్లాడుతున్న సందర్భంలో సోనియాగాంధీ ఆ వ్యాఖ్యలు చేసినందున కేవలం దానికి మాత్రమే పరిమితమవుతుందని, మొత్తానికే యాక్టీవ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలనే మెసేజ్ కాదని నొక్కిచెప్తున్నారు. సోనియాగాంధీ ప్రకటనలో స్పష్టత లేకపోవడంతో సందేహాలు తలెత్తాయి. భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలోనే పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగి మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
యాక్టీవ్ పాలిటిక్స్ నుంచి కాదు..
సోనియా ప్రసంగంలోని ఇన్నింగ్స్ ముగింపు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి షెల్జా మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి మాత్రమే ఆమె ముగింపు పలుకుతున్నారు తప్ప యాక్టివ్ పాలిటిక్స్ నుంచి కాదని వివరణ ఇచ్చారు. ఇంతకాలం పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే వాటిని చూస్తున్న సందర్భంలోనే సోనియాగాంధీ ఆ కామెంట్లు చేసినందున అక్కడి వరకే అది పరిమితమవుతుందన్నారు. ఇన్నింగ్స్ ముగింపు అంటూ సోనియాగాంధీ చేసిన ప్రకటనపై రకరకాలుగా చర్చలు జరగడం తమ దృష్టికి వచ్చిందని, ఇకపైన క్రియాశీల రాజకీయాల నుంచే తప్పుకోనున్నట్లు వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయని, అంధువల్లనే స్పష్టత ఇవ్వాలని భావించామన్నారు. మరికొద్దిమంది నేతలు కూడా దీన్నే నొక్కిచెప్పారు.
సంతృప్తికరంగా ఇన్నింగ్స్ ముగింపు...
తొలుత పార్టీకి 1998లో తాను అధ్యక్షురాలిని అయ్యాయనని, ఈ పాతికేళ్ళ కాలంలో సంస్థాగతంగా ఎన్నో అనుకూల, ప్రతికూల పరిస్థితులను, గెలుపోటములను చవిచూశామని సోనియాగాంధీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. సంతృప్తి కలిగించే విజయాలతో పాటు నిరుత్సాహపరిచే ఓటమిని కూడా చూశామన్నారు. క్రింది స్థాయి కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి వరకు ఎదిగిన మల్లికార్జున ఖర్గే గురించి ఆమె ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు. పార్టీకి, దేశ రాజకీయాలకు భారత్ జోడో యాత్ర ఒక టర్నింగ్ పాయింట్ అని అభివర్ణించారు. పార్టీకి, ప్రజలకు మధ్య సంభాషణలు జరగడానికి ఇది వారధిగా పనిచేసిందన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి, వారి తరఫున కొట్లాడడానికి కాంగ్రెస్ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుందని నొక్కిచెప్పారు.
పార్టీకి సంబంధించినంత వరకు భారత్ జోడో యాత్ర ఒక మేలి మలుపుగా అభివర్ణించిన సోనియాగాంధీ దేశవ్యాప్తంగానే ప్రజలు సామరస్యాన్ని, సహనాన్ని, సమానత్వాన్నికోరుకుంటున్నారని, ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందని ప్రకటించడం గమనార్హం. అదే సమయంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయడంలో పాల్గొన్న యువ, వృద్ధ కార్యకర్తలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వారి సమిష్టి సహకారం, ఆదరాభిమానం, వారి అకింతభావంతోనే యాత్ర సక్సెస్ అయిందన్నారు. సోనియాగాంధీ చేసిన కామెంట్లలోని ఉద్దేశాలు రానున్న కాలంలో బహిర్గతం కానున్నాయి.