మోడీ చేతిలో కేసీఆర్ రిమోట్.. ఆ బటన్లు చూపిస్తే CM సైలెంట్: రాహుల్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-11-25 11:06:15.0  )
మోడీ చేతిలో కేసీఆర్ రిమోట్.. ఆ బటన్లు చూపిస్తే CM సైలెంట్: రాహుల్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు కేవలం హామీలు మాత్రమే కాదని.. వాటిని చట్టంగా మార్చి పక్కాగా అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వాటిని అమలు చేయకపోతే ప్రశ్నించే హక్కును కూడా కల్పిస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బోధన్, ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. తెలంగాణలో దొరల పాలన నడుస్తోందని.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుతో దొరల తెలంగాణ అంతం అయి ప్రజల తెలంగాణ పరిపాలన ప్రారంభం కాబోతున్నదన్నారు. యాభై ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని కానీ ఆయన చదువుకున్న స్కూల్, కాలేజీలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినవేనన్నారు.

సోనియా గాంధీ దయవల్లే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను పరిపాలిస్తున్నారన్నారు. సోనియా గాంధీ చొరవ, రాజ్యాంగం, పార్లమెంటరీ సిస్టం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియా పెరిగిపోయిందని వీటి ద్వారా వచ్చే డబ్బు అంతా కేసీఆర్ ఇంటికే చేరుతోందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం లూటీ చేసిన ధనాన్ని ప్రజలకు పంచబోతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఈ మూడు పార్టీలు ఒక్కటేనని మోడీకి కేసీఆర్, ఓవైసీ ప్రియమిత్రులు అని విమర్శించారు.

కేసీఆర్ రిమోట్ మోడీ చేతిలో:

కేసీఆర్ రిమోట్ కంట్రోల్ ప్రధాన మంత్రి చేతిలో ఉందన్నారు. మోడీ చేతిలో ఉన్న రిమోట్‌లోని ఒక్కో బటన్‌లో సీబీఐ, ఈడీ, ఐటీ ఉన్నాయని.. అయితే ఆ బటన్లను కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు కోసం మాత్రం ఉపయోగించరన్నారు. మోడీ ఆ రిమోట్‌ను చూపించగానే కేసీఆర్ కూర్చుండిపోతారని ఆరోపించారు. నాలుగు నెలల క్రితం బీజేపీ నేతలు గర్వంగా ఛాతిని చూపిస్తూ ఇక్కడికి వచ్చేవారని కానీ కాంగ్రెస్ పార్టీ వారి గ్యాస్ అంతా తీసివేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ ఏమైందని మోడీ ఆశ్చర్యపోతున్నారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, ఢిల్లీలో మోడీని దింపేయడమే తమ లక్ష్యం అన్నారు.

దళిత బంధులో ఎమ్మెల్యేల అక్రమాలు:

బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు అక్రమాలకు పాల్పడుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇవ్వనిదే దళితబంధు ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని, పేదల భూములను లాక్కోవడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం చేశారన్నారు. దొరల తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. ఇక్కడి యువత కలలను, ఆశయాలను బీఆర్ఎస్ నాశనం చేసిందని ధ్వజమెత్తారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే సాగుకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. రైతుభరోసాను కౌలు రైతులకు సైతం అమలు చేస్తామన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. నల్ల చట్టాలు చేసి మోడీ రైతులను మోసం చేసింది. నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసింది. నాకు ప్రభుత్వ ఇంటిని తొలగించింది. సంతోషంగా నా ఇంటి తాళాలు ఇచ్చేశా. ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ ఒక్కటేనని రాష్ట్రంలో కేసీఆర్ కారు పంక్చర్ అయిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed